ఆసిఫాబాద్‌అర్బన్: పంటల కోత అనంతరం ధాన్యం నిల్వ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర గిడ్డంగుల సంస్థ(సీడబ్ల్యూసీ) ఆదిలాబాద్ మేనేజర్ వరికుంట రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలన్నారు. ధాన్యం నిల్వలో ఎలుకలు, ఉడతలు, లక్కపురుగులు, పలు క్రిమికీటకాలను నివారించే పద్ధతులు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం రైతులను స్థానిక ఎస్‌డబ్ల్యూసీ గోదాం వద్దకు తీసుకెళ్లి నిల్వ పద్ధతుల గురించి వివరించారు. రైతులకు కిలో చొప్పున ఎరువు, క్వింటాల్ సామర్థ్యం గల లోహపు డబ్బాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి మిలింద్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ విజయేందర్‌రెడ్డి, ఏఈవోలు చిరంజీవి, రాము, దమ్ముదాన్, సూపరింటెండెంట్ గౌతమ్, సిబ్బంది సాయి, ఫణీంద్ర, టెక్నికల్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.