
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్‌లో బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్‌తో కలిసి భూభారతి చట్టం అమలు, సన్నబియ్యం పంపిణీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణాపై చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అర్హుల జాబితా రూపకల్పన, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతులకు మేలు కలిగే విధంగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. విరాసత్, పాలు పంపకాలు, కొనుగోలు పట్టా మార్పిడిలో సంబంధీకులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భూభారతి చట్టంపై ఈ నెల 17 నుంచి 30 వరకు రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 314 పౌరసరఫరాల దుకాణాల ద్వారా ఇప్పటివరకు 90 శాతం సన్నబియ్యం పంపిణీ పూర్తయిందని వివరించారు. జిల్లాలో 80 శాతం పత్తి సాగవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు విక్రయించకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పైలట్ గ్రామాల్లో విడతల వారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపొందించేందుకు మండలస్థాయిలో గెజిటెడ్ స్థాయి అధికారులతో గడపగడపకూ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పైప్‌లైన్లకు మరమ్మతులు చేపట్టి మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా చేయలేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ అధికారులతో ప్రతిరోజూ అదనపు కలెక్టర్ సమీక్షిస్తున్నారన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. విత్తన విక్రయదారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు.