
నాడీ పట్టే నాథులేరి?
● పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ● రోగులకు అందని వైద్యం ● ప్రైవేట్‌కు వెళ్తున్న పేదలు
కౌటాల: వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినందున ప్రజలు వడదెబ్బతోపాటు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముంది. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. కానీ.. పీహెచ్‌సీల్లో వైద్యులు లేక పల్లె ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదు. ఏఎన్‌ఎంలే రోగులను చూసి మందులు రాసిస్తున్నా రు. పరిస్థితి ఏమాత్రం అటు.. ఇటుగా ఉన్నా.. పట్ట ణ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో పరీక్షలు చేసే విలువైన యంత్రాలు ఉన్నప్పటికీ సంబంధిత సిబ్బంది లేక అలంకారప్రాయంగా మారాయి. ఈ నేపథ్యంలో వైద్యం కోసం అప్పు చే సి, ప్రైవేట్‌కు వెళ్లడం లేదా దేవుడిపై భారం వేసే ప రిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు డీఎంహెచ్‌వో పోస్టు ఇన్‌చార్జులతోనే నెట్టుకువస్తున్నారు.
అందని ప్రభుత్వ వైద్యం
జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్(టి) సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రాలు) లున్నాయి. తిర్యాణి, జైనూర్, కాగజ్‌నగర్, బెజ్జూర్ ఆస్పత్రులనూ సీహెచ్‌సీలుగా మార్చారు. జిల్లాలో 20 పీహెచ్‌సీలున్నా యి. కొన్ని పీహెచ్‌సీల్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. ఒక్కో సీహెచ్‌సీలో తొమ్మిది మంది వైద్యులుండాలి. కానీ.. ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు. అలాగే జిల్లాలోని కౌటాల, కెరమెరి, సిర్పూర్ (యూ), లింగాపూర్, రవీంద్రనగర్ పీహెచ్‌సీల్లో వై ద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సమయపాలన సరిగా పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదని స్థానికులు చెబు తున్నారు. ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులే పెద్ద దిక్కుగా మారి, రోగులకు చికిత్స చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతీరోజు రోగులు వస్తుంటారు. కానీ.. వైద్యులు లేక బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పీహెచ్‌సీల్లో వైద్యులు లేక అమాయక ప్రజలు వైద్యం కోసం ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వచ్చీరాని వైద్యంతో వారు రోగులతో ఆడుకుంటున్నారు. ఆర్‌ఎంపీల వైద్యం కారణంగా జిల్లాలో పలువురు మృతి చెందిన ఘటనలున్నాయి.
నర్సులే పెద్ద దిక్కు
కౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యుడు లేక వైద్యశాఖ అధికారులు రిటైర్డ్ వైద్యుడిని నియమించగా కొద్ది నెలలుగా విధులు నిర్వహించారు. కానీ.. నెల క్రితం అతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో స్టాఫ్ నర్సులే అన్నీ తామై వైద్యం చేస్తున్నారు. కౌటాల ఫార్మసిస్ట్ పోస్టు కూడా ఖాళీగా ఉండగా రోగులకు తిప్పలు తప్పడం లేదు. సమీప మండలాలకు కౌటాల పీహెచ్‌సీయే దిక్కు. ముఖ్యంగా కౌటాల పీహెచ్‌సీకి నిత్యం 70 నుంచి 100 వరకు ఓపీ ఉంటుంది. దీంతో వైద్యులు సక్రమంగా రాని పరిస్థితుల్లో స్టాఫ్ నర్సులే చికిత్స చేస్తున్నారు. కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 60 నుంచి 70 వరకు సాధారణ ప్రసవాలు చేస్తారు. సాధారణ కాన్పులు అధికంగా చేయడంలో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది. కానీ.. ఈ పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం నెల రోజులుగా ఒక్కరూ లేకపోవడం విచారకరం. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యుడిని నియమించాలి
కౌటాల పీహెచ్‌సీకి వైద్యుడు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. రోగులకు స్టాఫ్ నర్సులే వైద్యం చేస్తున్నారు. కొంతమంది ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వారు డబ్బులు దండుకుని అమాయకులతో ఆడుకుంటున్నారు. వెంటనే వైద్యుడిని నియమించాలి.
– తిరుపతి, కౌటాల
సర్దుబాటు చేస్తాం
కౌటాల, రవీంద్రనగర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ) పీహెచ్‌సీల్లో వై ద్యులు లేరు. ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లాం. ఆ దేశాలు వచ్చిన వెంటనే వైద్యులను నియమిస్తాం. ప్రస్తుతం వైద్యులు లేని చోట సర్దుబాటు చేస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తాం.
– సీతారాం, డీఎంహెచ్‌వో

నాడీ పట్టే నాథులేరి?

నాడీ పట్టే నాథులేరి?