
దొడ్డి కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: దొడ్డి కొమురయ్య పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమురయ్య అమరత్వమే ప్రధాన కారణామన్నారు. నిజాం కాలంలో దుర్భర పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వెనుకబడిన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు రమేశ్, శంకర్, మారుతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు రేషన్‌కార్డులు జారీ చేస్తాం
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండలం ఘాట్ జనగాం గ్రామంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో పేదలకు మేలు జరుగుతుందన్నారు. కుటుంబ పోషణ భారం తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వినోద్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి రాథోడ్ బిక్కు, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.