
‘ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి’
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి ఓసీపీలో ముంపునకు గురయ్యే భూములకు ఎకరాకు రూ.25లక్షలు చెల్లించాలని, భూనిర్వాసితుల కుటుంబంలో ఒక్కరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులుగౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని గోలేటిలో సోమవారం ముంపునకు గురయ్యే భూముల యజమానులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టు పేరుతో తీసుకుంటున్న భూములకు ఎకరానికి రూ.7లక్షలు మా త్రమే చెల్లించాలని చూస్తోందన్నారు. మార్కెట్‌లో ఎకరానికి రూ.20లక్షలకు ఎక్కడా తక్కువ లేద న్నారు. కానీ యాజమాన్యం తక్కువ ఉన్న భూమి విలువను చూపించి దానికి రెండు రేట్లు అధికంగా ఇస్తున్నామని మోసం చేస్తోందని మండిపడ్డారు. బ్రోకర్లను నియమించుకుని కాస్తు, పట్టాదారు, అటవీభూమి పేరుతో దళిత, గిరిజన, బీసీ రైతులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా బ్రోకర్లతో నోటీసులు ఇచ్చి, బలవంతంగా రైతులతో సంతకాలు పెట్టిస్తోందన్నారు. భూనిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుంద స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, రైతులు ధర్మూపటేల్, సిడాం జైతు, నారా నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.