
అవకతవకలు జరగకుండా చూడాలి
వాంకిడి(ఆసిఫాబాద్): సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని డీఆర్ డిపోలో మంగళవారం ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. అనంతరం వాంకిడి పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. మొక్కల పెంపకం, సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటేందుకు సిద్ధం చేసిన బెడ్లు ఖాళీగా ఉండటంపై వివరణ కోరారు. కొన్ని బెడ్లలో మొక్కలు ఎండిపోయి ఉండటంతో వ్యవసాయ, అటవీశాఖ నుంచి మొక్కల పెంపకంపై సలహాలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలో పంచామృతం అందుబాటులో ఉంచాలని, క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏపీవో శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే