
నీటి కుంటల ఏర్పాటుకు శ్రీకారం
రెబ్బెన(ఆసిఫాబాద్): జల వనరులను పెంపొందించాలనే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం నీటి బిందువు –జల సింధువు కార్యక్రమంలో భాగంగా నీటి కుంటల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని సివిల్ జీఎం సూర్యనారాయణ, ఎన్విరాన్‌మెంట్ జీఎం సైదులు తెలిపారు. జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జలవనరుల పెంపు కోసం బెల్లంపల్లి ఏరియాలో చేపట్టిన నీటి కుంటల ఏర్పాటు పనులను మంగళవారం పరిశీలించారు. గోలేటి గ్రామ శివారులోని పంట పొలాల వద్ద చేపట్టిన నీటి కుంటల పనులను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. సింగరేణి సంస్థ చేపట్టిన కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీఎం సివిల్ ఎస్‌కే మదీనా బాషా, ఎన్విరాన్‌మెంట్ అధికారి హరీశ్, ఏరియా ఎస్టేట్స్ అధికారి సాగర్, ఈఈ సివిల్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.