
భూభారతితో సత్వర పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
వాంకిడి(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి ఆర్‌వోఆర్ చట్టం ద్వారా భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని రైతువేదికలో గు రువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, నిజమైన భూమి యజ మానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందని, సమస్యల పరిష్కారంలో అప్పీల్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు వివరించారు. తహసీల్దార్ జారీ చేసిన ఆర్డర్‌పై ఆర్డీవోకు, ఆ ఆర్డర్‌పై కలెక్టర్‌కు అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ధరణి పోర్టర్‌లో ఈ అవకాశం లేదని, విరాసత్ పట్టా మార్పిడిపై సంబంధిత పట్టాదారులకు నోటీసులు జారీ చేసే విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. కొనుగోలు, తనాఖా, దానం, పాలు పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారుకు పాసు పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఒకే రోజులో పూర్తయ్యేలా చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు. ప్రతీ రైతు హక్కులు, అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో గోపికాంత్ తదితరులు పాల్గొన్నారు.