
‘ఎల్‌ఆర్‌ఎస్’ చెల్లింపులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారు రుసుము చెల్లించేలా ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్‌ఆర్‌ఎస్ రుసుం వసూలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 25శాతం రాయితీతో రుసుము చెల్లించే గడువు ఈ నెల 30 వరకు ఉందని తెలిపారు. రుసుము చెల్లించిన వారికి ప్రొసీడింగ్ అందించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద 7,212 దరఖాస్తులు అందాయని, విచారణ అనంతరం 5,470 అర్హులైన దరఖాస్తుదారులు రుసుము చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1,022 మంది రుసుము వసూలు చేసేలా కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా సంప్రదించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రుసుము చెల్లించిన 328 మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీపీవో భిక్షపతిగౌడ్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.