జీఆర్‌పీ పోలీసుల సమక్షంలో హ్యాండ్ బ్యాగును బాధితురాలి సోదరుడికి అందజేస్తున్న టీటీఐ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):రైలు ప్రయాణంలో రూ. 40వేలు నగదుతో పాటుగా రూ. 6.5 లక్షల బంగారు ఆభరణాలు ఉన్న మహిళ హ్యాండ్ బ్యాగును విధుల్లో ఉన్న టీటీఐ గుర్తించి విచారణ అనంతరం బాధితులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ జి.లక్ష్మయ్య ఈ నెల 18న ఎల్‌టీటీ–విశాఖపట్నం రైలులో ఎస్–1, బీ–4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉదయం 5.10 గంటలకు రైలు భీమవరం టౌన్ దాటిన తరువాత బీ6 కోచ్‌లో బెర్త్‌లు తనిఖీలు చేస్తుండగా బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్‌పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గుర్తించారు.
దీనిపై తోటి ప్రయాణికులను విచారించగా భీమవరంలో స్టేషన్‌లో దిగిన కుటుంబానిదిగా తెలిపారు. దీంతో విషయాన్ని ఆయన విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. బ్యాగులోని ఫోన్ రింగ్ అవుతుండటంతో తోటి ప్రయాణికుల సమక్షంలో మాట్లాడగా హ్యాండ్ బ్యాగు ట్రైన్‌లో మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. కోచ్‌లోని ప్రయాణికుల సమక్షంలో బ్యాగులో ఏముందో నిర్ధారించాల్సిందిగా తెలపడంతో అందులో రూ. 40 వేల నగదు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పడంతో అవి సరిగా ఉండటంతో బ్యాగు బాధితురాలిదేనని నిర్ధారించారు.
ఆమె అభ్యర్ధన మేరకు రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని టీటీఐని కోరటంతో విషయం రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ ఆఫీసర్‌కు, జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైలు రాజమండ్రిలో ఆగిన తరువాత జీఆర్‌పీ పోలీసులు బాధితురాలి సోదరుడి నుంచి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో చిత్తశుద్ది, అంకితభావంతో వ్యవహరించి రైలు ప్రయాణికురాలి నష్టాన్ని నివారించిన టీటీఐ లక్ష్మయ్యను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment