గుడివాడరూరల్: భార్యాభర్తల మధ్య విభేదాలు నాలుగేళ్ల చిన్నారిని అనాథను చేశాయి. కోపంతో భార్యను కత్తితో పొడిన ఓ భర్త ఆపై పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన భార్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త కూడా మృతి చెందాడు. ఈ ఘటన గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. తాతపూడి రామలక్ష్మికి (26) ఐదేళ్ల క్రితం భీమవరం జిల్లా గణపవరం మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన తాతపూడి సూర్యనారాయణతో (33) వివాహమైంది.
వారికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అనుమానంతో రోజూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్తపై రామలక్ష్మి పోలీసు కేసు పెట్టింది. ఈ క్రమంలో నాలుగు నెలల నుంచి ఆమె గుడివాడలోని పుట్టింట్లో తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న కలహాలపై పెద్ద సమక్షంలో మాట్లాడుకుందామని రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణను ఆదివారం గుడివాడకు పిలిచించారు. వచ్చీరావడంతోనే ఇంట్లో ఉన్న భార్య రామలక్ష్మిపై తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డుకోబోయిన ఆమె తండ్రి వెంకన్నపైనా కత్తితో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన రామలక్ష్మిని స్థానికులు 108లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. రామలక్ష్మి తండ్రి వెంకన్న తీవ్ర గాయాలకు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పి.శ్రీకాంత్, వన్‌టౌన్ సీఐ కె.ఇంద్ర శ్రీనివాస్ తన సిబ్బందితో కలసి పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కలుపు మందుతాగి సూర్యనారాయణ మృతి...
భార్యను కత్తితో పొడిచిన అనంతరం సూర్యనారాయణ కలుపు మందుతాగి పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లో గుడివాడ ప్రభుత్వస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సూర్యనారాయణ మృతి చెందాడు. తల్లిదండ్రల మృతితో నాలుగేళ్ల చిన్నారి అనాథగా మిగిలాడు. రామలక్ష్మి హత్యతో ఎన్టీఆర్‌కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. రామలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment