సీసీ రోడ్ల నిర్మాణం.. అంతులేని నిర్లక్ష్యం
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో సంక్రాంతి పండుగ నాటికే పూర్తికావాల్సిన సీపీ రోడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఈ పనుల నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామా పథకం కింద గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కాంపోనెంట్ నిధులను కేటాయించింది. అక్టోబర్‌లో పల్లె పండుగ పేరిట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సంక్రాంతి వెళ్లి శివరాత్రి సమీపించినా లక్ష్యంలో 70 శాతం మాత్రమే పనులే పూర్త య్యాయి. ప్రస్తుతం పనులు సాగుతున్న తీరును గమనిస్తే పనులు పూర్తి కావడానికి మరో నెల రోజులకు పైగా పడుతుందని అంచనా.
అక్టోబర్‌లో పనులు ప్రారంభం
పల్లె పండుగ కార్యక్రమం కింద గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు వారం రోజుల పాటు విధి విధానాలు, పనుల గుర్తింపుపై గత ఏడాది ఆగస్టులో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను అధికార ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. జిల్లాలో ఉపాధి నిధులు రూ.15,537.59 లక్షలతో 1,964 పనులను గుర్తించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. ఆమోదం రావడంతో గత ఏడాది అక్టోబర్‌లో నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆ పనులకు భూమిపూజలకే రెండు వారాలకు పైగా సమయం పట్టింది. నవంబర్ నుంచి పనులను చేపట్టారు.
రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు..
పల్లె పండుగ కార్యక్రమం పేరిట ఒక్కొక్క అభివృద్ధి పనికి రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షలతో అంచనాలు రూపొందించారు. కూటమి ప్రభు త్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూచించిన నేతలకే ఆ పనులను ఎక్కడికక్కడ కట్టబెట్టారు. చాలా గ్రామాల్లో సర్పంచులకు ఈ పనులు కేటాయించక పోవటంతో వారి నుంచి వ్యతిరేకతను కూడా కూటమి ప్రభుత్వం మూట కట్టుకుంది. ఆ పనులను ఎలాంటి అనుభవం లేని కొత్త వారికి కట్టబెట్టడంతో పనుల్లో జాప్యం జరుగుతుందోన్న విమర్శలు లేకపోలేదు.
పనుల నిర్వహణ ఇలా..
జిల్లాలోని 25 మండలాల్లో ఉపాధి నిధుల కింద రూ.15,537.59 లక్షలతో పనులు మంజూరయ్యాయి. ఇందులో సీసీ రోడ్లతో పాటు అవసరమైన చోట మాత్రమే డ్రెయిన్లను నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా గ్రామాల టీడీపీ నేతలు చెప్పిన ప్రాంతాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 80 శాతం సీసీ రోడ్ల నిర్మాణానికే నిధులను కేటాయించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆ పనులు పూర్తయిన రోడ్లను కచ్చితంగా 21రోజుల పాటు నీటితో తడిపి క్యూరింగ్ చేయాలన్నది నిబంధన. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో అన్ని రోజుల పాటు క్యూరింగ్ చేయటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
త్వరలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి
జిల్లాలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పురోగతిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల 15వ తేదీకల్లా పూర్తి చేయాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పంచా యతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నాసిరకంగా చేసే పనులకు బిల్లులు మంజూరు కావు.
– పున్నమరాజు రమణరావు, కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ ఎస్‌ఈ
జిల్లాలో సంక్రాంతికే సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావాలన్నది లక్ష్యం
సంక్రాంతి వెళ్లి శివరాత్రి వస్తున్నా పూర్తికాని నిర్మాణ పనులు
గత అక్టోబర్‌లో ప్రారంభమైన పనులు 70 శాతమే జరిగిన వైనం
Comments
Please login to add a commentAdd a comment