బాబూ... తడి, పొడి చెత్త వేరుగా ఇస్తున్నారా?
పెడన: పూర్వం రాజ్యంలో పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి రాజులు రాజ్యంలో మారువేషాలతో తిరిగేవారని కథల్లో చదివేవాళ్లం. ఇప్పుడు అలా మారువేషం వేయకపోయినా కృష్ణాజిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం పెడన మండలంలోని ఒక గ్రామంలో మందీ మార్బలం లేకుండా తానొక్కరే నేరుగా అక్కడకు వెళ్లి గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితిపై గ్రామస్తులను ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఉదయం పెడన మండలం బలిపర్రు గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులు ఎవరికీ చెప్పకుండా మచిలీపట్నం నుంచి నేరుగా బలిపర్రు విచ్చేసిన కలెక్టర్ గ్రామంలో మార్నింగ్ వాకర్ లాగా నడుచుకుంటూ సంచరించారు. పాత బలిపర్రు రోడ్డులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి పారిశుద్ధ్య పరిస్థితులపై ఆరా తీశారు. తడి, పొడి చెత్తలపై అవగాహన ఉందో లేదో పరిశీలించారు. కొందరు పొడిపొడిగా సమాధానం ఇవ్వగా మరి కొందరు అసలు ఏం చెప్పలేకపోయారు.
కొసమెరుపు : అసలు వచ్చింది ఎవరో..ఏమిటో కూడా గ్రామస్తుల్లో చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment