నేటితో వీరమ్మతల్లి తిరునాళ్ల ముగింపు
ఉయ్యూరు: వీరమ్మతల్లీ...కాపాడమ్మా...కల్పవల్లీ..కరుణించమ్మా..అంటూ భక్తజనం అమ్మవారికి విశేష పూజలు జరిపించారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం శుక్రవారంతో 14వ రోజుకు చేరింది. 15 రోజులు పాటు జరిగే తిరునాళ్లు శనివారంతో ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అశేష భక్తజనం తరలివచ్చి చల్లనితల్లిని దర్శించుకుని భక్తిపారవశ్యం చెందారు. మహిళలు పాలపొంగళ్లు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పొట్టేళ్ల ప్రభ బండ్లుతో ఊరేగి అమ్మకు మొక్కులు చెల్లించారు. సంతానం ప్రసాదించాలని వేడుకుంటూ ఆలయం వెనుక పసుపు దుస్తులతో పానాచారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అన్నసంతర్పణ చేశారు. ఉయ్యూరు పట్టణ పోలీసులు గురువారం ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కుబడి చెల్లించారు. సీఐ రామారావు, ఎస్‌ఐ విశ్వనాఽథ్‌తో కలిసి పొట్టేళ్లను కానుకగా ఇచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు.
అలరించిన అమ్మవారి జీవిత చరిత్ర నాటకం
శ్రీ కనక చింతయ్య సమేత వీరమ్మతల్లి అమ్మవారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఆద్యంతం భక్తులను అలరించింది. తిరునాళ్లను పురస్కరించుకుని ఎంకే ఇంగ్లిష్ మీడియం పాఠశాల డైరెక్టర్ ఎంకే బాబు ఆధ్వర్యంలో ఎంకే గ్రూప్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు దేవతామూర్తుల వేషధారణలో సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అమ్మవారి జీవితచరిత్రను నాటక రూపంలో ప్రదర్శించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment