రాజ్యాంగానికి లోబడి పని చేయాలి
కేయూ ఉపకులపతి ఆచార్య రాంజీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి, కళాశాలలు నిబంధనల మేరకు పనిచేయాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్ సెంటర్‌ను ప్రారంభించి అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి పలు మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలో భద్రతా చర్యలు చేపట్టాలని, ఫైర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. కళాశాలల్లో స్టూడెంట్ క్లబ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు పొందవచ్చని సూచించారు. రెక్టర్, సీడీసీ డీన్ ఆచార్య ఎం.వి.బసవేస్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, పలు విభాగాధిపతులు ఆచార్య మారుతి, ఆచార్య దిలీప్, సహ ఆచార్యులు డాక్టర్ బ్రహ్మచారి, డాక్ట్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.