మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్య శాంతి కల్యాణంలో పాల్గొనే దంపతులకు దేవస్థానం తరఫున శ్రీ విశ్వావసునామ ఉగాది పర్వదినం నుంచి స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్నట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిత్యం జరిగే పూజ కార్యక్రమాల్లో శాంతి కల్యాణానికి ప్రాముఖ్యత ఉందని, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు.
ఆలయం తరఫున వారికి శేష వస్త్రం, జాకెట్ ముక్కలతో పాటు కల్యాణపు పెద్ద లడ్డూ ఇస్తుంటారని, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నుంచి కల్యాణంలో పాల్గొనే భక్తులకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్నట్లు వివరించారు. తొలిసారిగా స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి చిత్రపటాలను అందజేశారు.
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో శ్రీకాంత్‌కు కీలక బాధ్యతలు
విజయవాడస్పోర్ట్స్: అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహిళల ప్రపంచ కప్ కబడ్డీ–2025 పోటీల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిగా విజయవాడకు చెందిన యలమంచిలి శ్రీకాంత్ నియమితులయ్యారు. బిహార్‌లోని రాజ్‌గిర్‌లో 13 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల జట్లు పాల్గొంటాయి. ఈ పోటీల నిర్వహణలో కీలక బాధ్యతను శ్రీకాంత్ అప్పగిస్తూ అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్‌ఐ) అధ్యక్ష, కార్యదర్శులు విబోర్ వి. జైన్, జితేంద్ర పి. ఠాగూర్ ఈనెల 29వ తేదీ శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు.
శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిగా, ఏకేఎఫ్‌ఐ కార్యవర్గ సభ్యుడి హోదాలో ఉన్నారు. ఈ సందర్భంగా దక్షిణ భారత అథ్లెటిక్స్ మానటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ సీఈవో వెంకట్ నామిశెట్టి తదితరులు శ్రీకాంత్‌ను ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి.వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా అర్జునరావు, కోశాధికారి ఎన్.సుబ్బరాజు అభినందించారు.
ముగ్గుల పోటీల్లో జగ్గయ్యపేట యువతి సత్తా
జగ్గయ్యపేట అర్బన్: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రపదేశ్ అమెరికన్ అసోసియేషన్(ఏఏఏ) ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీల్లో జగ్గయ్యపేటకు చెందిన మామిడి హర్షిత అనే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న యువతి సత్తా చాటి, ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ద్వితీయ బహుమతికి రూ.15,00,116 నగదు ఇస్తారని ఆమె వివరించారు. శ్రీనివాస కల్యాణం ఇతివృత్తంతో రోజుకు 7, 8 గంటలు చొప్పున 15 రోజులు శ్రమించి ముగ్గును తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హర్షితను మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.

ఇకపై దంపతులకు స్వామివారి చిత్రపటం బహూకరణ