ఒకే పని.. రెండు బిల్లులు | - | Sakshi
Sakshi News home page

ఒకే పని.. రెండు బిల్లులు

Published Fri, Mar 21 2025 2:08 AM | Last Updated on Fri, Mar 21 2025 2:05 AM

ఒకే ప

ఒకే పని.. రెండు బిల్లులు

అవనిగడ్డ: నిధులులేక ఎన్నో సంవత్సరాల నుంచి పలు చోట్ల పంట కాలువల్లో పూడికతీత పనులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవనిగడ్డలో మాత్రం ఒకే పంట కాలువకు రెండు రకాల బిల్లులతో పనులు జరుగుతున్నాయి. ఒక పక్క యంత్రాలతో కాంట్రాక్టర్‌ పంటకాలువ పూడిక తీత పనులు చేపట్టారు. మరో వైపు అదే కాలువలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఒకే పనిని రెండు రకాలుగా చేయడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు రోజులుగా పనులు

అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 16 పంట కాలువల్లో పూడికతీత పనులను రూ.39.90 లక్షలకు విజయవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకున్నారు. ఈ మేరకు ఆరు రోజుల నుంచి యంత్రాలతో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా అవనిగడ్డ మండల పరిధిలోని అశ్వరావుపాలెం – మందపాకల పంటకాలువ పూడిక తీతను రెండు రోజుల క్రితం క్రితం చివరి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇదే కాలువకు మొదలులో నాలుగు రోజుల నుంచి రోజుకు 50 నుంచి 60 మంది ఉపాధి కూలీలు ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నారు. ఈ పంటకాలువకు సంబంధించి ఇప్పటి వరకూ ఉపాధి కూలీలు రూ.80 వేలు విలువగల పనులు పూర్తి చేశారు. ఈ కాలువకు సంబంధించి ఎవరు ఎన్నిచోట్ల పనులు చేసినా కాంట్రాక్టర్‌కు కేటా యించిన నిధులు మాత్రం ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చోట్ల డ్రెయిన్లు, పంట బోదెలకు సంవత్సరాల తరబడి పూడికతీయలేదు. దీంతో కొద్దిపాటి వర్షాలకు సైతం డ్రెయిన్లు పొంగి పంటపొలాలను ముంచెత్తడం దివి సీమలో పరిపాటిగా మారింది. గత ఏడాది ఖరీప్‌లో కురిసిన భారీ వర్షాలకు ఆరు మండలాల్లో 23 వేల ఎకరాలు వరిపంట ముంపునకు గురైన విషయం విదితమే. అవసరమైన చోట పనులు చేయకుండా ఒకే కాలువకు రెండు విధాలుగా పనులు చేయిస్తూ ప్రజాధనం వృథా చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకేపనికి రెండు విధాలా ప్రజాధనం వృథా అవుతుంటే ఏమి చేస్తున్నారని కొంత మంది రైతులు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై ఇరిగేషన్‌ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. అశ్వరావుపాలెం – మందపాకల కాలువకు ఉపాధి కూలీలు పనులు చేస్తున్న విషయం తనకు తెలియదన్నారు. రేపటి నుంచి పనులు ఆపేస్తామని చెప్పారు. ఏపీఓ రవి కుమార్‌ని వివరణ కోరగా.. ఇరిగేషన్‌ అధికారుల ఆదేశాల మేరకే కూలీలతో ఉపాఽధి పనులు చేపట్టామని చెప్పడం గమనార్హం.

ఎగువ నుంచి యంత్రాలతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌

దిగువ నుంచి ఉపాధి హామీ పథకంకూలీలతో జరుగుతున్న పనులు

ఒకే కాలువకు రెండు విధాలా పనులపై విస్మయం

ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని విమర్శలు

ఒకే పని.. రెండు బిల్లులు1
1/1

ఒకే పని.. రెండు బిల్లులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement