ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ స్టేషన్‌కు సన్నాహాలు
కంకిపాడు: మండల కేంద్రమైన కంకిపాడులో ఆటోమేటిక్ రెయిన్‌గేజ్ స్టేషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఎగువ వైపు ఖాళీ స్థలంలో రెయిన్‌గేజ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించారు. ఆ స్థలంలో రెయిన్‌గేజ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన పనులను చేపట్టారు. వాతావరణ పరిస్థితుల అంచనాలు, వర్షపాత నమోదు తదితర అంశాలు స్టేషన్ ద్వారా వెల్లడి కానున్నాయి. స్టేషన్ పనులను తహసీల్దార్ వి.భావనారాయణ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
పోలీసులకు సేవా, ఉత్తమ సేవా పతకాలు
కోనేరుసెంటర్: ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లాలో పలువురు పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలు, ఉత్తమ సేవా పతకాలను అందజేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణాజిల్లా స్పెషల్‌బ్రాంచ్ విభాగంలో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న వై. లక్ష్మణస్వామి ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. అలాగే జిల్లా స్పెషల్‌బ్రాంచ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న కె. హేమానందం (హెచ్‌సీ–1252), మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కేవీ శ్రీనివాసరావు(హెచ్‌సి–604), డార్మిట్‌లో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ జె. నందకిషోర్ (ఏఆర్‌హెచ్‌సీ–915), అవనిగడ్డ పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె. వెంకటేశ్వరరావు(హెచ్‌సీ–719), ఉమెన్ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న బి. శాంతకుమారి (ఉమెన్ ఏఎస్‌ఐ– 1617), డార్మిట్‌లో పనిచేస్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్‌కే ఇబ్రహీం (ఏఆర్‌హెచ్‌సీ–2363), గుడివాడ టూ టౌన్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌కే రీహాన్ (పీసీ–1108), కంకిపాడు పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పి. రాధాకృష్ణ (పీసీ–794)లు సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. వీరంతా ఉగాది రోజున ప్రభుత్వం తరపున పతకాలను అందుకోనున్నారు.
ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 21,114 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 20,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీఈవో పీవీజే రామారావు జిల్లాలోని ఏడు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజు రెండు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 37 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ స్కూల్స్‌కు సంబంధించి 1,035 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 739 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మాస్ కాపీయింగ్ జరగలేదని డీఈవో తెలిపారు.