మచిలీపట్నంటౌన్: వచ్చే జూన్ 15వ తేదీ నాటికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి రవీంద్ర శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గిలకలదిండి సముద్ర తీరంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత వారు గిలకలదిండిలోని మత్స్యశాఖ కార్యాలయ కమ్యూనికేషన్ స్టేషనులో ఫిషింగ్ హార్బర్ రేఖా చిత్రపటా న్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఫిష్ హ్యాండ్లింగ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్, రేడియో కమ్యూనికేషన్ తదితర భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం చేపల వేటకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. పడవల తయారీ కూడా ఇక్కడే జరుగుతుందన్నారు. రూ.421 కోట్ల వ్యయంతో మార్చి 2021 సంవత్సరంలో హార్బర్ నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ 35 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. నిర్ణీత గడువు ముగిసినందున మరలా నిర్మాణ కాలం గడువు పొడిగింపునకు నిధుల మంజూరుకు మారిటైంబోర్డు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు కొంతమేరకు జరిగాయని, సముద్ర ముఖ ద్వారం డిజైన్లు ఇంకా నిర్ధారణ కాలేదని, చైన్నె ఐఐటీ నివేదిక అందాల్సి ఉందన్నారు. ఆ నివేదిక తక్షణమే తెప్పించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. హార్బర్లో వివిధ రకాల భవనాల నిర్మాణ పనులు, నీరు, మురుగునీటి వ్యవస్థ, రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు వేట నిషేధ కాలం ఉంటుందని, ఆ లోగా తప్పనిసరిగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తన చిన్నతనంలో ఇక్కడ ఓడల నిర్మాణం జరిగేదని, ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు గట్టిగా కృషి చేస్తానన్నారు. ఇందులో భాగంగా ఇక్కడి మత్స్యకారులకు పర్యాటక శాఖ ద్వారా పడవల నిర్మాణంపై నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో ఇక్కడ తయారయ్యే పడవలను ప్రపంచంలో ఎక్కడికై నా పంపించే విధంగా అభివృద్ధి పరుస్తామన్నారు. ఇక ప్రతి వారం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి సత్వరమే పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. పర్యటనలో మంత్రి, కలెక్టర్ వెంట మత్స్య శాఖ అధికారి నాగబాబు, మారిటైమ్ బోర్డు కన్సల్టెన్సీ ఏపీ అర్బన్ సీనియర్ ఇంజినీర్ శశికుమార్, ప్రాజెక్టు మేనేజర్ ప్రసాదరావు, తహసీల్దారు మధుసూదన్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర