చిలకలపూడి(మచిలీపట్నం): దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తుందని, వారు సురక్షిత తీరం – సమృద్ధి భారత్ లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం సముద్ర తీర సైకిల్ ర్యాలీని జిల్లా కలెక్టర్, ఏఎస్పీ సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ ర్యాలీలో 50 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో కలసి జిల్లా కలెక్టర్ బాలాజీ, అదనపు ఎస్పీ సత్యనారాయణ నగరంలో మూడు స్తంభాల సెంటర్ వరకు సైకిల్ తొక్కుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యున్నత ప్రమాణాలతో భద్రతను అందిస్తున్న పారా మిలటరీ దళం సీఐఎస్‌ఎఫ్ అని కొనియాడారు. సముద్ర తీర ప్రాంత ప్రజల్లో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించి దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలను సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో మమేకం చేస్తూ ర్యాలీ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సైకిల్ ర్యాలీ కలకత్తా నుంచి మొదలై తమిళనాడులోని కన్యాకుమారి వరకు 6 వేల కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాల్లో సాగుతుందన్నారు. సముద్రతీరంలో ఏమైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు, ఇతర ఇంటిలిజెన్స్ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలు భద్రత సిబ్బందికి తెలియజేయడం ద్వారా రాబోయే ముప్పును అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ డెప్యూటీ కమాండెంట్లు వినీత్ కుమార్ ప్రభాకర్, హృషబ్ దేవాంగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ శర్మ పలువురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
అవనిగడ్డ: నిషేధిత మందులను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. అవనిగడ్డ లోని పలు మెడికల్ షాపులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములు మెడికల్ షాపులను తనిఖీలు చేసినట్టు తెలిపారు. కొన్నిచోట్ల నిషేధిత మందులు, ఎన్‌ఆర్‌ఎక్స్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారని, అలా చేస్తే వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవనిగడ్డలో రికార్డుల్లో చూపించిన వాటికంటే ఎక్కువగా ఉన్న రూ.55వేల విలువైన ట్రెమడాల్, ఆల్ఫాజూలం మందులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఇలాంటి మందులను ఉపయోగించడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్నారు. డాక్టర్ సూచనలు లేకుండా ఇలాంటి మందులు విక్రయించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల దుకాణాల యజమానులు ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా 1972 లీగల్ కంట్రోల్ సెల్‌కు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీజ్ చేసిన డ్రగ్‌ని అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీకి ఐజీ రవికృష్ణ అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ నగేష్‌బాబు, డ్రగ్ కంట్రోల్ శాఖ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్, పోలీస్‌శాఖ సోషల్ మీడియా సీఐ నున్నరాజు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 100 టీములతో మెడికల్ షాపుల తనిఖీ విజిలెన్స్ ఐజీ రవికృష్ణ
దేశ భద్రతలో సీఐఎస్‌ఎఫ్ కీలకం