చేనేత వస్త్రాలను ఆదరించాలి | - | Sakshi
Sakshi News home page

చేనేత వస్త్రాలను ఆదరించాలి

Published Wed, Mar 26 2025 1:45 AM | Last Updated on Wed, Mar 26 2025 1:43 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. ఎంజీ రోడ్డులోని శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలను మంగళవారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాల అమ్మకాలకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ రేఖారాణి, జాయింట్‌ డైరెక్టర్‌ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు.

దారి దోపిడీ కేసులో నిందితులకు కఠిన కారాగార శిక్ష

గన్నవరం: దారి దోపిడీ కేసులో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ గన్నవరం 8వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి చెందిన ఓ వైద్యుడు వద్ద మొగల్రాజపురానికి చెందిన కుక్కల వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌. గతేడాది ఆగస్టు 26వ తేదీ రాత్రి ఆయన మరదలు వరసైన కొమ్ము శిరోమణితో కలిసి వెంకటేశ్వర్లు బైక్‌పై ముస్తాబాద వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలో రిలయన్స్‌ గోడౌన్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు వీరి బైక్‌ను అడ్డుకున్నారు. వీరి వద్ద బంగారు చైన్‌, ఉంగరంతో పాటు చెవి దిద్దులు, కీప్యాడ్‌ ఫోన్‌ను లాక్కుని దుండగులు పరారయ్యారు. ఘటనపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన విజయవాడలోని జక్కంపూడికి చెందిన పాలపర్తి వెంకన్న, నల్లగొండ సురేష్‌, కుమ్మరిపాలెంకు చెందిన నక్కా గోపిరాజును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ 8వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజుల జైలుశిక్ష అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసులో గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్‌ నేతృత్వంలో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ టి. మాధవి వాదనలు వినిపించారు.

ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ పనులు పూర్తి

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లో విజయవాడ రైల్వే డివిజన్‌ 206.29 ఆర్‌కేఎం (రూట్‌ కిలోమీటర్లు) ఆటోమెటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ (ఏబీఎస్‌)ను విజయవంతంగా పూర్తిచేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డివిజన్‌లోనే కీలకమైన సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు సెక్షన్‌లో ఈ నెల 23న 29.67 ఆర్‌కేఎం ఏడీఎస్‌ను విజయవంతంగా పూర్తిచేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిజన్‌ 206.29 ఆర్‌కేఎం సాధించినట్లైంది. దీంతో విజయవాడ–విశాఖపట్నం, విజయవాడ– గూడూరు సెక్షన్‌న్లలో రద్దీ తగ్గుతుంది. ఏబీఎస్‌ అనేది రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని పెంచు తుంది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం నరేంద్ర అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు.

చేనేత వస్త్రాలను ఆదరించాలి 1
1/1

చేనేత వస్త్రాలను ఆదరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement