చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, మిల్లర్లు, రైతులతో గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,51718 హెక్టార్లలో, రబీ సీజన్‌లో ఐదు వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1224, ఎంసీఎం 125, ఎంటీయూ 1061, ఎంటీయూ 1121 రకాలు ఉన్నాయని వివరించారు. వాటిలో బీపీటీ 5204, ఎంటీయూ 1224, ఎంసీఎం 125 సన్న రకాల వరి పంటలు గత ఖరీఫ్ సీజన్లో 30 శాతం సాగు చేశారని తెలిపారు. ఈ మూడు రకాల వరి పంటలను మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం గ్రామ విత్తన ఉత్పత్తి పథకం కింద ఈ సన్న రకం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల వారీగా అభ్యుదయ రైతులను గుర్తించాలన్నారు. మిల్లర్లు కూడా ఈ రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, ఏడీ మణిధర్, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మాదేవి, శాస్త్రవేత్తలు డాక్టర్ డి.సుధారాణి, డాక్టర్ కె.నాగేంద్ర, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ డీఎం శ్రీనివాసరావు, పలువురు రైతులు, మిల్లర్లు పాల్గొన్నారు.