
ఆధునిక సౌకర్యాలతో మిత్ర హాస్పిటల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో మిత్ర హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.దుర్గానాగరాజు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలో నూతన హాస్పిటల్‌ను ఆదివారం ప్రారంభించారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చికిత్సలందించేలా మిత్ర హాస్పిటల్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలో తనతో పాటు యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కేవీ రవికుమార్, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ పీ విశ్వేశ్వరరావులు సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పారదర్శకంగా రోగ నిర్ధారణ, పరిపూర్ణ వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దీనదయాళన్, స్పైన్ సర్జన్ డాక్టర్ అజోయ్ ప్రసాద్ శెట్టి, యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చోడిశెట్టి, ఏజీహెచ్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్, ఫిజీషియన్ డాక్టర్ పి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.