
తెలంగాణ సెర్ఫ్ బృందం పర్యటన
జగ్గయ్యపేట: మండలంలోని తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి గ్రామాల్లో మంగళవారం జరిగిన సామాజిక భద్రత పెన్షన్‌ల పంపిణీ పని తీరును తెలంగాణ సెర్ఫ్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సెర్ఫ్ బృంద ప్రతినిధి గోపాలరావు, బృంద సభ్యులు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పింఛన్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ యాప్ ద్వారా పెన్షన్‌ల పంపిణీ లేదని పీవోటీ డివైస్ ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పింఛన్‌ల పంపిణీ పరిశీలనకు వచ్చామని చెప్పారు. కొందరు లబ్ధిదారులు గత ప్రభుత్వంలో వలంటీర్‌ల ద్వారా పింఛన్‌లు పంపిణీ చేశారని చెప్పగా గత ప్రభుత్వంలో కూడా పంపిణీ బాగుందని తెలిసిందన్నారు. కార్యక్రమంలో బృంద సభ్యులు శ్రీనివాస్, గోపీనాథ్, గిరిధర్, రవి, ఎంపీడీవో నితిన్, సర్పంచ్‌లు యలమర్ది శ్రీనివాసరావు, త్రివేణి, కార్యదర్శులు శేఖర్, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న పాలిసెట్–2025కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంజ్‌సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పాలిసెట్–2025కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాలిసెట్–2025 ప్రవేశ పరీక్ష ఈ నెల 30వ తేదీన జరుగుతుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం 94926 85021లో సంప్రదించాలని ఆయన కోరారు.
సూరంపల్లిలో
40 పందులు చోరీ
గన్నవరం: మండలంలోని సూరంపల్లి శివారు లో 40 పందులను దొంగలు అపహరించుకుపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా వున్నాయి. గ్రామానికి చెందిన కొంత మంది శివారులో పందులను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 40 పందులను వాహనంలో ఎక్కించుకుని ఎత్తుకుపోయారు. తెల్లవారుజామున పందులు కనిపించకపోవడంతో సదరు పెంపకందారులు గన్నవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలకుపైనే ఉంటుందని చెబుతున్నారు. రంగంలోకి దిగిన క్రైం పోలీసులు బాధితుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు. గ్రామ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.