
రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
జగ్గయ్యపేట అర్బన్: భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, దేశంలోని సెక్యులర్ పార్టీలన్నీ ఒక్కతాటి మీద నిలబడి అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. వక్ఫ్‌బోర్డుల ఆస్తుల సవరణను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పాత మునిసిపల్ కార్యాలయం కూడలిలో మంగళవారం రాత్రి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సభ జరిగింది. ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మతాలు, కులాలకు సమన్యాయం కలిగేలా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. అంబానీ, టాటా, అదానీ, ఆదిత్య బిర్లా వంటి కంపెనీలకు రూ.లక్షల కోట్లు దోచిపెట్టడమే మోదీ విధానమన్నారు.
చంద్రబాబు, పవన్‌వి అబద్ధాలు..
సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదని రామకృష్ణ విమర్శించారు. ఇప్పటికీ చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని, పేదరికం పోవాలంటే జనాభాను పెంచుకోవాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. పేదరికం పోవాలంటే జనాభాను పెంచుకోవడం కాదని, సంపద సృష్టించాలని సూచించారు. పార్టీ నాయకులు దోనేపూడి శంకర్, అంబోజి శివాజి, చుంటూరు సుబ్బారావు, దళిత హక్కుల పోరాటసమితి కార్యదర్శి బుట్టి రాయప్ప, పట్టణ కార్యదర్శి జె.శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నియోజకవర్గ కన్వీనర్ పోతిపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.