
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
రేపటి నుంచి మూల్యాంకనం
మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17న పరీక్షలు ప్రారంభమవగా.. జిల్లాలో 22,341 మంది విద్యార్థులు 145 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాశారు. కాగా మంగళవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,049 హాజరుకాకావాల్సి ఉండగా 20,691 మంది హాజరు కాగా అత్యధికంగా 358 మంది గైర్హాజరయ్యారు. అంతకుముందు తెలుగు పరీక్షకు 21,072 గాను 250, హిందీకి 21,024 గాను 315, ఇంగ్లిష్‌కు 21,040 గాను 244, గణితానికి 21,049 గాను 257, సాంఘిక శాస్త్రం పరీక్షకు 21,024 గాను 255 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు.
మూల్యాంకనానికి ఏర్పాట్లు..
ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగనుంది. మచిలీపట్నంలోని లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. జిల్లాకు 1,91,627 జవాబు పత్రాలు వచ్చాయి. 1,196 మంది సీఈ, ఏఈలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేయనున్నారు.
మత్స్య సంపద అభివృద్ధికి ‘సిఫా’ సేవలు
రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్
రామ్‌శంకర్‌నాయక్
పెనమలూరు: మత్స్యరంగం అభివృద్ధికి, రైతులు మత్స్య దిగుబడులు సాధించటానికి మంచినీటి జీవపాలన సంస్థ (సిఫా) ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో మంగళవారం నిర్వహించిన సిఫా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 38వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిఫా పరిశోధనలతో చేపలలో నూతనంగా 26 వంగడాలు సృష్టించారన్నారు. చేపలలో వచ్చే వ్యాధుల నివారణకు, చేపల సాగు రైతులకు అధిక దిగుబడులు రావడానికి సిఫా ఉత్తమమైన సూచనలు, సలహాలు ఇస్తోందని పేర్కొన్నారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ సిఫా పంగాస్, రూప్‌చంద్ చేపల ఉత్పత్తి చేసి నేడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ కె.రాఘవరావు, ఆర్‌జీసీఏ సైంటిస్టు ఇన్‌చార్జ్ అప్పలనాయుడు, సైంటిస్ట్ అజిత్‌కేశవ్ చౌదరిపాల్గొన్నారు.