
పాఠశాలల విలీనంతో విద్యార్థులకు దూరాభారం
పామర్రు: పాఠశాలల విలీనం వలన విద్యార్థులకు దూరాభారం అవుతుందని పలువురు తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ఎదుట వాపోయారు. కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం పామర్రు మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. పామర్రులోని నర్సు చెరువు వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల విలీనంపై పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్‌పర్సన్ ఎం.మంగాదేవి కలెక్టర్ ఎదుట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకు ఇద్దరు పిల్లలని, ప్రస్తుతం వారు కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నారని, ఇప్పుడు విలీనం వలన రెండు కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని చెప్పారు. రద్దు చేసిన పాఠశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరుపుతోందని తల్లిదండ్రులు అందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
దుర్గంధంతో ఫౌండేషన్ ప్లస్ పాఠశాల
ప్రభుత్వం పామర్రులోని ఫౌండేషన్ ప్లస్ బాలుర ఎంపీపీ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాల ఆవరణ మురికి కాలువలు గుర్రపు డెక్కతో నిండి దుర్వాసన వస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీ ఈవోకు కాలువలు సరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువ గుడివాడ–పామర్రు అండర్‌పాస్ జాతీయ రహదారిలో భాగంగా అనుసంధానమై ఉండటంతో నీళ్లు నిలిచిపోతున్నాయని ఈవో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంఽధిత జాతీయ రహదారి అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు, డీవైఈఓ పద్మారాణి, ఎంఈవో పద్మవాణి, ఉపాధ్యాయురాలు మృదుల పాల్గొన్నారు.
కలెక్టర్ ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసిన ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ తల్లిదండ్రులకు నచ్చజెప్పే యత్నం చేసిన కలెక్టర్