
100 అడుగుల రోడ్డులో కారు బీభత్సం
పెనమలూరు: కానూరు 100 అడుగుల రోడ్డులో బుధవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఎనికేపాడు నుంచి తాడిగడప జంక్షన్ వైపునకు అతి వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి పంట బోదెలో పడింది. డివైడర్ మధ్యలో ఉన్న సెంట్రల్ లైటింగ్ స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుపై ఎవరైనా ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఘటనపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభం అలానే ఉంది.
కిడ్నాప్ కలకలం..
పోరంకిలో బుధవారం రాత్రి కిడ్నాప్ కలకలం చెలరేగింది. తన తండ్రిని కొందరు ఇంటి వద్ద నుంచి కిడ్నాప్ చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల కారణంగానే పోరంకిలో ఉంటున్న వెంకటేశ్వరరావును వ్యాపార పార్టనర్ రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆమె తెలిపింది. ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేయలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనలో ఇరువురు రాజీ పడినట్లు సమాచారం.

100 అడుగుల రోడ్డులో కారు బీభత్సం