కోడూరు: కోడూరు గంగాభవానీ అమ్మవారికి ‘లక్ష’ గారెలతో మహానివేదన కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. అమ్మవారి 50వ జాతరోత్సవాల నేపథ్యంలో గురువారం గారెలతో మహానివేదన జరిపారు. కోడూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు తమ ఇళ్ల వద్ద నుంచి గారెలను వండి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఒక్కో మహిళ 54 లేదా 108 గారెలను తీసుకువచ్చి అమ్మవారికి నివేదించారు. గంగాభవానీ చిన్నఅమ్మవారి విగ్రహం ముందు గారెలను రాశిగా పోసి పండితులు కొమ్మూరి శ్రీనివాసరావు పూజలు చేశారు. జాతరకు వచ్చిన గ్రామ ఆడపడుచులు, మహిళలు ప్రతి ఒకరూ కార్యకమ్రంలో పాల్గొని భక్తిభావం చాటుకున్నారు. మహానివేదన అనంతరం గారెలను ప్ర సాదంగా భక్తులకు అందజేశారు. ధర్మకర్త కోట యుగంధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.13.90 లక్షల ఆదాయం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయంలో బహిరంగ వేలం ద్వారా రూ.13.90 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ కిశోర్‌కుమార్ తెలిపారు. ఆలయ బేడా మండపంలో గురువారం జరిగిన వేలంలో ఆలయం వద్ద ఏడాది పాటు భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరుచు లైసెన్స్ హక్కుకు రూ.13.90 లక్షలకు(కాకాని రవిబాబు) పాడుకున్నారు. ఈఈ రమ, పాలకవర్గ సభ్యులు బెజవాడ శ్రీనివాసరావు, పాలాది వెంకటరమణ, ఏఈఓ ఉమాపతి పాల్గొన్నారు.
రేపు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ పరీక్ష ఈ నెల ఐదో తేదీన నగరంలో నిర్వహించనున్నట్లు విజయవాడ కేంద్రం కోఆర్డినేటర్ జి.బర్న్‌బస్ తెలిపారు. విజయవాడలోని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చిట్టూరి హైస్కూల్ ప్రాంగణాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. 973 మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్ష విద్యార్థులు, 393 మంది తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోందన్నారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు పరిశీలకులను ఆ శాఖ నియమించిందని, వారి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.

గంగాభవానీకి ‘లక్ష’ గారెలతో మహానివేదన