
వైభవంగా వెండి రథోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవ సేవ నిర్వహించారు. సాయంత్రం 5 గంట లకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద వెండి రథంపై కొలువై ఉన్న స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈవో దుర్గారావు, ఇతర ఆలయ అధికారులు వెండి పల్లకీని ముందుకు లాగి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళవాయిద్యా ల నడుమ, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్‌రోడ్డు నుంచి ప్రారంభమైన నగరోత్సవం కుమ్మరిపాలెం, కామకోటి నగర్, శంకరమఠం, విద్యాధరపురం, సొరంగ మార్గం, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా వెండి రథంపై అధిష్టించిన స్వామి వారు భక్తుల ఇంటి ముంగిటకు విచ్చేయడంతో హారతులిచ్చి పూలు, పండ్లు, కొబ్బరి కాయలను సమర్పించి పూజలు చేశారు.
బెజవాడ వీధుల్లో ఊరేగిన
దుర్గామల్లేశ్వరులు