
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పటిష్ట ఏర్పాట్లు
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగర ప్రజలకు ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తరకటూరులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను అధికారులతో కలిసి శనివారం మంత్రి పరిశీలించారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ట్యాంక్‌లో ప్రస్తుతం నాలుగున్నర మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకున్నామని, అవసరమైతే గరిష్ట స్థాయి వరకు నిల్వ చేసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో 70 హెచ్‌పీ మోటార్లు మాత్రమే ఉండగా కొత్త మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడామన్నారు. అదే సమయంలో ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. పంపుల చెరువులో కూడా నీటి నిల్వ 8 అడుగుల వరకు ఉందని, పూర్తి సామర్థ్యం 13 అడుగులకు పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తరకటూరు నుంచి బందరు వరకు పైపు లైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. కృష్ణా నది నుంచి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకుంటే తాగునీటికి ఇబ్బందులు లేకుండా పోతాయని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేలా అధికారులు కూడా చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. నగరంలోని పుట్లమ్మ చెరువులను, హెడ్ వాటర్ వర్క్స్‌ను మంత్రి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షుడు ఇలియాస్‌పాషా, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.