వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. | - | Sakshi
Sakshi News home page

వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..

Published Sat, Sep 9 2023 1:58 AM | Last Updated on Sat, Sep 9 2023 2:24 PM

తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలోని పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట - Sakshi

తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలోని పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఈ ఏడాది అధికమాసం కావడంతో వర్షాల రాక ఆలస్యమైంది. జూన్‌లో తొలకరి జల్లులు పడినా.. ఆ తర్వాత వరుణుడు కాస్త ముఖం చాటేశాడు. తిరిగి ఆగస్టులో మంచి వర్షం కురవడంతో వజ్రాన్వేషణ మొదలైంది. గతేడాది నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు ఇతర జిల్లాల వారు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ వాలిపోతున్నారు.

తుగ్గలి, మద్దికెర మండలాల్లో ఏటా జూన్‌, జులై మాసాల్లో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతుంది. దొరికిన వజ్రాలు కొనుగోలు చేసేందుకు గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో వ్యాపారులు ఉన్నారు. వీరు గ్రామాల్లో కొందరు ఏజెంట్లను నియమించుకున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం రాగానే ఏజెంట్లు వారి వద్ద వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారులు వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం బాగా విలువైంది అయితే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. గతంలో వేల నుంచి రూ.20 లక్షల వరకు వజ్రాలు కొనుగోలు చేశారు.

ఈ ఏడాది ఇప్పటికే 8 వజ్రాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. అంతలా ఇక్కడి వ్యాపారులు నమ్మకం సంపాదించారు. చెప్పిన ధరకు సంబంధించిన డబ్బు వ్యాపారుల వద్దనే ఉంచితే వడ్డీ సహా చెల్లిస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా రాదనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

వజ్రాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఇవే..

కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జీఎస్‌ఐ(జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) గుర్తించింది.

► తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెర ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతున్నాయి.

► అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలో గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్‌.ఎంపీ.తండాలో వజ్రాల జాడ ఉంది.

► వజ్రకూరు, తుగ్గలి, మద్దికెరలో 50–60 కిలోమీటర్ల సరిహద్దులో వజ్రనిక్షేపాలను గుర్తించారు.

► ఈ ప్రాంతంలో కింబర్‌ లైట్‌ పైప్‌లైన్‌ ఉందని గనులు, భూగర్భ శాఖ నిర్ధారించింది.

► వజ్రాలు, బంగారు నిక్షేపాలపై గత కొన్నేళ్లుగా పరిశోధన జరుగుతుంది.

► విదేశీ సంస్థలు కూడా ఇక్కడ నిక్షేపాలపై పరిశోధన చేయడం విశేషం.

చాలా దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు
వజ్రాల మైనింగ్‌ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. అయితే వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్‌ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే దీని వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే, మన దేశంలోని వజ్రాలకు ప్రపంచ మార్కెట్‌లో చాలా విలువ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్‌ డైమండ్స్‌ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు బయటపడుతున్నాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్‌ చేస్తే వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.

వజ్రాలు ఎలా  లభ్యమవుతాయంటే.. 
మన దేశంలో డైమండ్‌మైనింగ్‌ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లు తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేస్తారు. కానీ వజ్రకరూర్‌, తుగ్గలి, జొన్నగిరిలో మాత్రం రాళ్లు ఉన్నాయి. ఇవి 150 మీటర్ల లోతులో ఉంటాయి. అయితే భూమిలో కొన్ని వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్‌(వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిచి పగిలిపోతాయి. అప్పుడు వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడ నిలుస్తున్నాయి. ఇంకొన్ని వాగులు, వంకల ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు రెండు జిల్లాలలో లభిస్తున్నాయి.

ఈ ఏడాది లభించిన వజ్రాల వివరాలు

మే 27: చిన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది.

దీన్ని రూ.3.03లక్షలకు విక్రయించారు.

జూన్‌11: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తే దాన్ని రూ.30వేలకు విక్రయించారు.

జూన్‌ 26: రామాపురంలో లభించిన వజ్రాన్నిఓ వ్యక్తి రూ.1.30లక్షలకు విక్రయించారు.

జూలై 23: జి.ఎర్రగుడిలో వజ్రం లభించింది.అయితే దాన్ని ఇప్పటి వరకూ విక్రయించలేదు.

ఆగస్టు 31: జొన్నగిరిలో ఓ రైతుకు వజ్రం లభిస్తేరూ.40వేలకు అమ్మేశారు.

సెప్టెంబర్‌ 2: గిరిగెట్లలో దొరికిన వజ్రాన్నిరూ.2లక్షల నగదు, రెండు తులాల బంగారానికి విక్రయించారు. అదే రోజుజొన్నగిరిలో ఓ వజ్రాన్ని రూ.40వేల నగదు, జత బంగారు కమ్మలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు.

సెప్టెంబర్‌ 6: పీ.కొత్తూరులో కలుపు తీస్తున్న మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. గురువారంఅనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓవ్యాపారి టెండర్‌లో రూ.72 వేలకు కొనుగోలు చేశాడు.

వజ్రాలు దొరుకుతాయంటే వచ్చా
మాది కదిరి దగ్గర మొలకల చెరువు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయంటే ఏడుగురు గుంపుగా కలిసి వచ్చాం. పొలాల్లో విత్తనం వేశారు. రైతులు పొలాల్లోకి రానీయడం లేదు. పంట లేని పొలాల్లో తిరుగుతున్నాం. ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్లలేక సాగు చేసిన పొలాల్లో కూడా పంట లేని చోట వెతుకుతున్నాం. వజ్రం ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు.
– మహబూబ్‌బీ, మొలకల చెరువు,అనంతపురం జిల్లా

రెండేళ్ల నుంచి వస్తున్నా
టీవీల్లో, వాట్సాప్‌ల్లో వారంలో మూడు వజ్రాలు.. ఒక్కరోజే రెండు వజ్రాలు లభించాయని చూశాం. నేను మూడు రోజుల కిందట వజ్రాల కోసం వచ్చా. రెండేళ్ల నుంచి వస్తూనే ఉన్నా. అందరూ జొన్నగిరిలోని ఓ పొలంలో ఎక్కువ వజ్రాలు దొరుకుతాయంటారు. రైతులు పొలాల్లో తిరగనీయకుండా తరుముతున్నారు. హోటళ్లో తింటూ రాత్రిపూట ఏదో ఒక చోట తలదాటుచుకుంటాం.
– శీను, పెండ్లిమర్రి, వైఎస్సార్‌ కడప జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement