వారికి పుట్టుకతోనే గుండె జబ్బులు | - | Sakshi
Sakshi News home page

వారికి పుట్టుకతోనే గుండె జబ్బులు

Published Wed, Feb 14 2024 9:04 AM | Last Updated on Wed, Feb 14 2024 10:32 AM

- - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): ఇంట్లో ఉన్న చిన్నారికి కాస్త జ్వరం వస్తేనే తల్లిదండ్రుల హృదయం అల్లాడిపోతుంది. జ్వరం ఎప్పుడు తగ్గుతుందా అని అటు మందులు వాడుతూనే మరోవైపు వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది చిన్నారి గుండెకు సమస్య ఏర్పడితే వారి బాధ చెప్పనలవికాదు. ఇటీవల పలు కారణాల రీత్యా ఒక శాతం మంది పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మిస్తున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జబ్బులు రాకుండా ఎలా ఉండాలనే అంశంపై ఏటా ఫిబ్రవరి 14న పుట్టుకతో వచ్చే గుండెజబ్బులపై అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.

ఇటీవల కాలంలో పలువురు చిన్నారులకు పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రతి వెయ్యి మందిలో 8 నుంచి 10 మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మిస్తున్నారు. మన దేశంలో ఏటా దాదాపు 2.4 లక్షల మంది చిన్నారులు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలతో జన్మిస్తున్నారు. 85 శాతం వరకు కారణాలు తెలియవు.. కానీ వంశపారంపర్యంగా 10 నుంచి 15 శాతం మాత్రమే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి వెయ్యి మందిలో 1.5–1.7 చొప్పున బాల్యంలో తీవ్రమైన గుండె సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా వెయ్యి మంది పిల్లలు ఈ విధమైన సమస్యతో జన్మిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న డిస్ట్రిక్ట్‌ అర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌(డైస్‌)లో 15 మంది చిన్నారులు గుండెజబ్బులకు చికిత్స తీసుకుంటున్నారు.

గుండెకు వచ్చే సమస్యలు
అతి సున్నితమైన గుండె నిర్మాణం సంక్లిష్టమైనది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవడం, రక్తప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడుతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారి తీస్తాయి. గుండె రంధ్రాలు(సెప్టల్‌ డిఫిక్ట్స్‌). గుండెలోపాల్లో దాదాపు 25 శాతం ఇలాంటి సమస్యలే ఉంటాయి.

చిన్నారుల గుండె జబ్బులకు కారణాలు పోషకాల లోపం

ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండెలోపాలకు అవకాశం.

గర్భిణికి ఇన్‌ఫెక్షన్లు

తొలి మూడు నెలల్లో పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సైతం లోపాలకు దారి తీయొచ్చు.

మేనరికపు వివాహాలు

మేనరికపు వివాహం చేసుకున్న వారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు తలెత్తవచ్చు. మేనరికపు వివాహాలు చేసుకున్న వారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యి మందిలో 40 నుంచి 50 మందికి గుండెలోపాలు ఉండే అవకాశం ఉంది. వీరికి ఇతరత్రా లోపాల ముప్పూ ఎక్కువే.

జన్యులోపాలు

కొందరికి జన్యులోపాలతోనూ గుండెనిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావచ్చు.

పురుగుల మందులు, రేడియేషన్‌

గర్భం ధరించిన తొలివారాల్లో పురుగు మందులు, రేడియేషన్‌, కొన్ని రకాల మందుల ప్రభావానికి గురైనా గుండెలోపాలు తలెత్తవచ్చు. పొగ, మద్యం అలవాట్లు, గర్భధారణ సమయంలో పొగతాగడం, మద్యం తాగడం వంటి అలవాట్లతోనూ గుండె ఏర్పడే ప్రక్రియ అస్తవ్యస్తం కావచ్చు. ఇది లోపాలకు దారి తీయొచ్చు.

గుండె వైఫల్య లక్షణాలు
సాధారణంగా గుండెలో రంధ్రాలు ఏర్పడిన వారిలో ఇవి కనిపిస్తాయి. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం ఎక్కువగా కలిసిపోతుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి. దీంతో పిల్లలు పాలు సరిగా తాగలేరు. ఆయాసం, తరచూ న్యూమోనియా బారిన పడటం వంటివి వేధిస్తాయి.

చర్మం నీలం
చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి ఒళ్లంతా విస్తరించడం వల్ల పెదాలు, వేళ్లు, నాలుక వంటివి నీలంగా మారతాయి. కొందరికి ఉన్నట్లుండి నీలంగా అవడం ఎక్కువ కావచ్చు. కనుగుడ్లు తేలేయొచ్చు.

నిస్సత్తువ
కవాటాలు బిగుసుకుపోవడం, లీక్‌ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. పెద్ద అయ్యాక శారీరక శ్రమను అంతగా తట్టుకోలేరు. ఆటలకు దూరంగా ఉంటుంటారు. తోటివారితో ఆడుకోవడానికి వెనుకాడతారు.

18 వారాల్లోనే గుర్తించవచ్చు
ఫీటల్‌ ఎకో కార్డియోగ్రామ్‌ పరీక్ష ద్వారా గర్భస్త శిశువుల్లో గుండెలోపాలను 18 వారాల గర్భంలోనే గుర్తించవచ్చు. గుండె లోపాలు మున్ముందు ఎలా పరిణమిస్తాయి, బిడ్డ ఆరోగ్యం ఎలా ఉండగలదు అనేవి తెలుస్తాయి. దీన్ని బట్టి ముందుగానే శస్త్రచికిత్సలను నిర్ణయించుకోవచ్చు. కవాటాలు మూసుకుపోయిన వారికి కొన్నిసార్లు గర్భంలో ఉండగానే సరిదిద్దే పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి.

అధునాత చికిత్సా పద్ధతులు
గుండె, ఊపిరితిత్తుల పనితీరు అర్థం కావడం, అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడం, సుశిక్షితులైన సిబ్బంది, శస్త్రచికిత్స అనంతరం సేవలవంటివన్నీ గుండెలోపాలతో సంభవించే మరణాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అధునాతన చికిత్సలతో చాలా వరకు గుండెలోపాలను పూర్తిగా సరిదిద్దవచ్చు. కొందరికి తొలిదశలో ఆయా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలు అవసరం కావచ్చు. పూర్తిగా సరిదిద్దడం సాధ్యం కాని వారికి అవసరమైనప్పుడల్లా ఉపశమన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ముందుగానే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే సరైన మందులు ఇవ్వడం, ఆహారపరంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రక్తహీనత మూలంగా గుండె విఫలమయ్యే ముప్పు పొంచి ఉండటం వల్ల ఐరన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

గుండెలో రంధ్రాలు అధిక శాతం అవే పూడిపోతాయి
గుండెలో పుట్టుకతో ఏర్పడి న రంధ్రాల్లో ఎక్కువ శా తం వాటంతటవే మూసుకుపోతాయి. వీటికి శస్త్రచికిత్సలు అవసరం లేదు. గుండెలోపాలతో పుట్టిన వారిలో దాదాపు 20 శాతం మందికి పుట్టిన నెలలోపే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారిలో చాలా మందికి బడికి వెళ్లే వయస్సులో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. శిశువుకు, అదీ గుండెకు శస్త్రచికిత్స అంటే భయం కలగడం సహజమే. ఇప్పుడు అంత భయపడాల్సిన పనేమీ లేదు.
– డాక్టర్‌ జి.సందీప్‌కుమార్‌, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, కర్నూలు

ఆరోగ్యశ్రీలో ఉచితంగా..
గుండెజబ్బులున్న చిన్నారులను కర్నూలు సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి తీసుకురావాలి. అక్కడి వైద్యులు పరీక్షించి వారిని తిరుపతి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. అన్ని చోట్లా చిన్నారుల గుండెజబ్బులకు ఉచితంగా ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేస్తున్నారు. వారి వయస్సు తదితర అంశాలను బట్టి వైద్యులు శస్త్రచికిత్స చేయాలా వద్దా, శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఎప్పుడు చేయాలనేది నిర్ణయిస్తారు.
 – డాక్టర్‌ ఎం.భాస్కరరెడ్డి,ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement