
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
గోనెగండ్ల: అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. శనివారం మండల కేంద్రం గోనెగండ్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మీపేటలో ఆయన అధికారులతో కలసి చీపురు చేతపట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు.. మన ఇళ్లు.. వీధి శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల్లో ఉండాలన్నారు. స్వచ్ఛ గోనెగండ్లగా తీర్చిదిద్ది అవార్డు పొందాలన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రాలు గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులుగా మారాలని సూచించారు. గ్రామస్తులకు సొంత స్థలాలు ఉంటే వాటిలో కంపోస్టు పిట్‌లు తవ్వుకుని వర్మీకంపోస్టు తయారు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం క్లాప్ మిత్రలను శాలువతో సత్కరించారు. చెత్త సంపద తయారీ కేంద్రంలో కలెక్టర్ కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, డీపీఓ భాస్కర్, డీఎల్‌పీఓ నూర్జహాన్, తహసీల్దార్ కుమారస్వామి, ఈఓఆర్డీ అనంతసేన, సర్పంచ్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.
తడి, పొడి చెత్త వేరుపై
అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
Comments
Please login to add a commentAdd a comment