జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి
కర్నూలు(సెంట్రల్): జర్నలిస్టులపై దాడులు చేస్తే తక్షణమే అరెస్టు చేసేలా రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, నాయకులు గోరంట్లప్ప, కేబీ శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ నాగేంద్ర కోరారు. పార్వతీమన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి మండల రిపోర్టర్ రామారావుపై దాడి చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ నాయుడును తక్షణమే అరెస్టు చేయాలన్నారు. లేదంటే ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతామని హెచ్చరించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట జర్నస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. ‘తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పండుకోబెడతాను’ అని బెదిరించినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసీ డాక్టర్ బి.నవ్యకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సునీల్‌కుమార్, బ్రహ్మయ్య, శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment