యూట్యూబ్ చానల్ విలేకరి అదృశ్యం
మద్దికెర: ఇంటి నుంచి పొలానికి ద్విచక్రవాహనంపై బయల్దేరిన యూట్యూబ్ చానల్ విలేకరి, మద్దికెర గ్రామానికి చెందిన బోగోలు తిరుమలరెడ్డి (45) బుగ్గ సంగాల వద్ద అదృశ్యమయ్యాడు. ఘటనా స్థలంలో మొబైల్, చెప్పులు పడి ఉన్నాయి. బైక్‌పై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లున్నాయి. ఎవరో పథకం ప్రకారం దాడిచేసి.. కిడ్నాప్ చేశారా.. లేక హత్య చేసి కాలువలో పడేశారా అనేది తెలియడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గ్రామానికి చెందిన బోగోలు వెంకటరెడ్డి, సౌభాగ్యలక్ష్మి కుమారుడైన బోగోలు తిరుమలరెడ్డి గుంతకల్లులో నివాసం ఉంటూ బీవీఆర్ టుడే న్యూస్ అనే యూట్యూబ్ చానల్‌కు విలేకరిగా ఉంటూనే బుగ్గ సమీపంలోని తన తోటలో వ్యవసాయ పనులు చేసేవాడు. రోజు మాదిరిగానే సోమవారం తోటకు వెళ్లాడు. కాలువ వెంబడి తోటకు వెళ్లే రస్తాలో పడివున్న బైకును చూసి రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారు – ఆర్టీసీ బస్సు ఢీ
శ్రీశైలం: శ్రీశైలం సమీపంలోని రామయ్య టర్నింగ్ వద్ద కారు – తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ప్రతిక్ మిశ్రా, రష్మీ మిశ్రా దంపతులు కారులో శ్రీశైలం బయలుదేరారు. రామయ్య టర్నింగ్ వద్ద ఎదురుగా వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రతీక్ మిశ్రా, డ్రైవర్ వాసులకు స్వల్ప గాయాలు కాగా స్థానికులు ప్రథమ చికిత్స చేయించారు. రష్మీ మిశ్రా షాక్‌కు గురి కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు.
20 గడ్డివాముల దగ్ధం
మద్దికెర: మద్దికెర గ్రామ శివారులోని కొత్తపల్లి రహదారిలో ఉన్న స్వామి, చిన్న రంగస్వామి, ఈరన్న, రాముడు, హనుమంతు, ప్రసాద్, మాణిక్యం, నాగప్ప, మల్లికార్జున అనే రైతులకు చెందిన 20 గడ్డివాములు సోమవారం తెల్లవారుజామున కాలిబూడిదయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాములుకు నిప్పు పెట్టడంతో తమకు దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment