పొరపాట్లకు తావు లేకుండా రీసర్వే
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): పొరపాట్లకు తావులేకుండా రీసర్వే చేపట్టాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు నిర్వహణపై కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రెవెన్యూ, సర్వే సిబ్బందికి బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మండలానికి ఒక గ్రామంలో రీసర్వే చేపట్టారన్నారు. స్టాండర్ ఆపరేషన్ ప్రొసిజర్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సర్వేయర్లు, వీఆర్వోలకు సూచించారు. ఆస్తి బదలాయింపులో ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయని, ఈ ప్రక్రియను చేపట్టేటప్పుడు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీఓ నంబర్ 30 ప్రకారం అనధికార, అభ్యంతరం లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, సర్వే ఏడీ మునికన్నన్ పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత
శ్రీశైలంటెంపుల్/ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధవారం శ్రీశైలంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ క్యూలు, ఆలయ పరిసరాలు, శివస్వాముల ప్రత్యేక క్యూలైన్, స్నాన ఘట్టాలు, రథ మండపం, కమాండ్ కంట్రోల్ రూం, శ్రీశైలం డ్యాం, ఘాట్‌రోడ్డు మొదలైన ప్రదేశాల్లో పర్యటించారు. అనంతరం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్‌కుమార్‌రెడ్డి, దేవస్థాన ఈఈ మురళీ పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో ఫార్మసీ ప్రొవిజనల్ మెరిట్ జాబితా
కర్నూలు(హాస్పిటల్): కడప జోన్–4 పరిధిలోని ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను https://cfw.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆర్‌డీ డాక్టర్ రామగిడ్డయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెబ్‌సైట్‌లో ఉంచిన అభ్యర్థన పత్రంలో స్వయంగా కడపలోని ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీలోపు సమర్పించాలన్నారు. గడువు తీరిన తర్వాత వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోబడవన్నారు. ఫైనల్ మెరిట్ జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రదర్శిస్తామన్నారు.
పొరపాట్లకు తావు లేకుండా రీసర్వే
Comments
Please login to add a commentAdd a comment