యూరియా పంపిణీలో విఫలం | - | Sakshi
Sakshi News home page

యూరియా పంపిణీలో విఫలం

Published Fri, Feb 21 2025 8:36 AM | Last Updated on Fri, Feb 21 2025 8:33 AM

యూరియ

యూరియా పంపిణీలో విఫలం

కర్నూలు(అర్బన్‌): నంద్యాల జిల్లాలో రబీ రైతులకు యూరియాను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని జెడ్పీ చైర్మన్‌ యర్ర బోతుల పాపిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జెడ్పీలో స్థాయీ సంఘ సమావేశాలు హుందాగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విత్తనాలు రైతు భరోసా కేంద్రా ల్లో ఎంతో పారదర్శకంగా పంపిణీ అయ్యేవని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయలేక పోవడంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జనవరి నెల నుంచి యూరియాకు సంబంధించిన వరుస కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా .. ఎందుకు చర్యలు చేపట్టలేక పోతున్నారని నంద్యాల వ్యవసా య శాఖ అధికారి మురళీకృష్ణపై జెడ్పీ చైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వరి సాగు పెరిగిందని, సాధారణ సాగు 27 వేల హెక్టార్లు కాగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం 37 వేలకు పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన సమాధానంపై చైర్మన్‌ పాపిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. డిమాండ్‌కు అనుగుణంగా ముందుగానే యూరియాను ఎందు కు తెప్పించలేక పోయారని అసహనం వ్యక్తం చేశారు. ఆర్‌బీకేల ద్వారా ఒక బస్తాను రూ.267కు అందించాల్సి ఉండగా, బయటి మార్కెట్‌లో రైతులు ఒక బస్తా యూరియాను రూ.350 నుంచి రూ.400 పెట్టి కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇందుకు బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు.

మిర్చి ధరల పతనంపై సుదీర్ఘ చర్చ

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో రాష్ట్రంలో మిర్చి ధరలు పతనం కావడంపై సుదీర్ఘ చర్చ జరిపారు. జిల్లాలో సాధారణంగా 95 వేల నుంచి ఒక లక్ష ఎకరాల వరకు మిర్చి పంటను వేసేవారని, గత ఏడాది ధరలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1.43 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారని హార్టికల్చర్‌ అధికారిణి సమాధానం ఇచ్చారు. గతేడాది ఒక క్వింటాలు రూ.23 వేల వరకు ధర పలికిందని, ఈ ఏడాది ఒక క్వింటాలు రూ.11 వేలు కూడా లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్యాపిలి జెడ్పీటీసీ బీ శ్రీరాంరెడ్డి తెలిపారు. అధికారుల సలహాల మేరకు వాడిన మందులతో తెగుళ్లు కూడా కంట్రోల్‌ కావడం లేదన్నారు. ధరలు పతనమైన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఏమి చేస్తే బాగుంటుందో తెలియజేయాలని ఆదోని ఎమ్మెల్యే బీ పార్థసారథి కోరారు. ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం అందించే ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామన్నారు.

నాపరాయి పరిశ్రమలను ఆదుకోవాలి

జిల్లాలో మానవీయ కోణంలో నాపరాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. మేజర్‌ మినరల్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న నాపరాయి పరిశ్రమలపై విజిలెన్స్‌ దాడులు చేయడం శోచనీయమన్నారు. ఈ పరిశ్రమలకు రాయల్టీ ఫీజును కూడా తొలగించాలని, కేవలం ఉపాధి రంగంగా చూస్తు అవసరమైన మేర ప్రభుత్వం రాయితీలు ప్రకటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు విజయవంతం అయ్యేందుకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల, తాగునీరు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, సీ్త్ర శిశు సంక్షేమం, గృహ నిర్మాణం, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు హాజరయ్యారు.

ఆరోగ్యశ్రీలో

భారీగా

అక్రమాలు

నంద్యాల వ్యవసాయ అధికారిపై

జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం

మిర్చి ధరల పతనంపై సుదీర్ఘ చర్చ

ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు:

ఎమ్మెల్యే పార్థసారథి

హుందాగా సాగిన జెడ్పీ స్థాయీ

సంఘ సమావేశాలు

పేదలకు అందించే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ బీ పార్థసారథి ఆరోపించారు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వం, నిరక్షరాస్యత, వ్యాధి తీవ్రతను ఆసరాగా చేసుకొని పలు ఆసుపత్రులు కోట్ల రూపాయాలను అక్రమంగా ఆర్జిస్తున్నాయన్నారు. గత ఆరు నెలలుగా జిల్లాకు రూ.118 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం నుంచి బిల్లుల రూపంలో విడుదలయ్యాయని, ఇంతకు రెండింతలు పలు ఆసుపత్రులు ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసి ఉంటాయన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులపై ఉందన్నారు. ఏ మేరకు అవగాహన కల్పించారనే విషయాన్ని వచ్చే సమావేశంలో తనకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన అనేక మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీపై వైద్యం చేసే ఆసుపత్రులకు సంబంధించి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
యూరియా పంపిణీలో విఫలం1
1/1

యూరియా పంపిణీలో విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement