అడుగులన్నీ శ్రీగిరి వైపు..
శ్రీశైలంటెంపుల్: ఓం హరోం హరా..
శంభో శంకరా.. ఓం నమఃశివాయ..
అంటూ భక్తుల శివనామస్మరణతో నల్లమల గిరులు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మల్లన్న చెంతకు పాదయాత్రగా భక్తులు చేరుకుంటున్నారు. పలువురు శివస్వాములు, సాధారణ భక్తులు నల్లమల మీదుగా శ్రీగిరికి వస్తున్నారు. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర గోసాయికట్ట, వీరాంజనేయస్వామి గుడి, నాగలూటి వీరభద్రస్వామి దేవాలయం, దామెర్లకుంట, పెచ్చెరువు, మఠం బావి, భీమునికొలను, కై లాసద్వారం చేరుకుంటున్నారు. అక్కడి నుంచి హఠకేశ్వరం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుని మల్లన్నను దర్శించుకుంటున్నారు. నల్లమలలో ఎత్తైన కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో నడుచుకుంటూ వృద్ధులు, మహిళలు దాదాపు 40 కిలోమీటర్లు పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మరో వైపు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా వాహనాల్లో శ్రీశైలానికి తరలివస్తున్నారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత, రూ.200, రూ.500 క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి, నిర్ధిష్ట వేళలలో మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు.
నల్లమల మీదుగా పాదయాత్రగా మల్లన్న చెంతకు భక్తులు
అడుగులన్నీ శ్రీగిరి వైపు..
Comments
Please login to add a commentAdd a comment