కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి
తుగ్గలి: కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతి చెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన జొన్నగిరి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రైతు ఉల్సాల అంజినయ్య షెడ్‌లో గొర్రెలు ఉంచగా కుక్కలు ప్రవేశించి దాడి చేశాయి. తనకు రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.
నాపరాతి గని గుంతలో పడివృద్ధుడి మృతి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లెకు చెందిన వృద్ధుడు మంజుల బొజ్జన్న(72) గని గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఐదు రోజుల క్రితం బొజ్జన్న చింతలాయిపల్లె రోడ్డులో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. గురువారం గనుల సమీపంలో గొర్రెలు కాపారులు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి గ్రామంలో విచారించారు. చనిపోయినది బొజ్జన్నగా అతని కుటుంబీకులు గుర్తించారు. మద్యం తీసుకొని ఇంటికెళ్తూ మార్గమధ్యలో నాపరాతి గని రాళ్లగుట్ట వద్ద కాలుజారి గని గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధుడి ఆత్మహత్య
ఆత్మకూరురూరల్: నల్లకాల్వ సమీపంలోని వైఎస్సార్ స్మృతి వనం వద్ద ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జూపల్లి బాలన్న (65) గురువారం స్మృతివనం ప్రహరీకి తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆత్మకూరు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ నారాయణ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం ఫొటోను పోలీసు, మీడియా వాట్సప్ గ్రూపుల్లో ఉంచడంతో చివరకు ఆచూకీ లభించింది. కుటుంబీకులు గుర్తించి ఆత్మకూరు చేరుకున్నట్లు సీఐ రాము తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
● డ్రైవర్ సురక్షితం
పాణ్యం: ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ కాల్వలో దూసుకెళ్లింది. ట్రాక్టర్‌లో నుంచి దూకి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మండల కేంద్రమైన పాణ్యం సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా వన్‌వేను ఏర్పాటు చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాల్వలపై ఉన్న బ్రిడ్జి ఇరుకుగా ఉంది. ఈ బ్రిడ్జిపైనే వన్‌వే ఏర్పాటు చేశారు. పాణ్యం గ్రామానికి చెందిన నడిపెన్న ట్రాక్టర్‌ను ఈ తోవలోనే తోలుతున్నాడు. ప్రమాదశాత్తు ట్రాక్టర్ కాల్వలోకి దూసుకెళ్లగా ఆయన కిందకు దూకడంతో ఎలాంటి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment