గుంతకల్లు: యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు భోగాల తిరుమలరెడ్డి (42) హత్య కేసును గుంతకల్లు రూరల్ పోలీసులు ఛేదించారు. ముందుగా ట్రాక్టర్‌తో ఢీకొట్టి, అనంతరం హంద్రీ–నీవా కాలవలో పడేసినట్లు గుర్తించారు. గురువారం కసాపురం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ ఎన్.ప్రవీణ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన తిరుమలరెడ్డి గుంతకల్లులోని తిలక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ‘బీవీఆర్ న్యూస్ టుడే’ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన జీవన్‌కుమార్ తన నాలుగు ఎకరాల పొలం పక్కనే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుండగా, ఈ విషయమై తిరుమలరెడ్డి, జీవన్‌కుమార్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. తనకు డబ్బు ఇవ్వకుంటే కథ చూస్తానంటూ జీవన్‌కుమార్‌ను తిరుమలరెడ్డి వేధించేవాడు. దీంతో ఒప్పందం కుదుర్చుకుని కొంత డబ్బును జీవన్‌కుమార్ చెల్లించాడు. అయితే, అక్కడితో ఆగకుండా తహసీల్దార్‌కు తిరుమలరెడ్డి ఫిర్యాదు చేయడంతో జీవన్‌కుమార్ కక్ష పెంచుకున్నాడు. బోయ రామాంజినేయులు, బోయ రామన్నతో కలిసి తిరుమలరెడ్డి హత్యకు పథకం రచించాడు. ఈ నెల 17న ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పొలానికి బయలుదేరిన తిరుమలరెడ్డిని కసాపురం సమీపంలోని హంద్రీ–నీవా కాలువ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ట్రాక్టర్‌తో బలంగా ఢీకొట్టారు. దీంతో స్పృహ కోల్పోయిన తిరుమలరెడ్డిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి హంద్రీ–నీవా కాలువలో పడేసి పరారయ్యారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు డీఎస్పీ ఏ.శ్రీనివాస్ నేతృత్వంలో ముమ్మరంగా విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సీఐ వివరించారు.
యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment