పల్లె పుష్కరిణిలుగా చెరువుల అభివృద్ధి
కర్నూలు(అగ్రికల్చర్): ఉపాధి నిధులతో గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను ‘పల్లె పుష్కరిణిలు’గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో 31 పల్లె పుష్కరిణిలను గుర్తించారు. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులను.. కనీసం వెయ్యి జనాభా కలిగిన గ్రామాల్లో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు చెరువులను మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీలు, దేవాలయ కమిటీలు, గ్రామ ప్రజల సమ్మతితో మాత్రమే కోనేర్లను అభివృద్ధి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశించింది.
జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా
కర్నూలు (టౌన్): జిల్లాకు చెందిన 51 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి పరమేశ్వర రెడ్డి తెలిపారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులకు మంగళవారం ఆర్‌ఐఓ గురువయ్యశెట్టితో కలిసి ఆయన పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకన్న, లాలప్ప, అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హర్షవర్దన్ పాల్గొన్నారు.
తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి
కొత్తపల్లి: తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి చెందాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం.జాన్సన్, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేజీ నాయక్ గిరిజనులకు సూచించారు. మంగళవారం మండలంలోని పాలెంచెరువు గూడెంలో గిరిజనులకు తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నేషనల్ హానీ బీ బోర్డ్ సంయుక్తంగా పాలెంచెరువు గ్రామానికి చెందిన 25 మంది గిరిజన రైతులకు శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగలను పెంచి, తేనెను తయారు చేసుకునే విధానంపై ఏడు రోజుల శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, సర్పంచు మశమ్మ, జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, శాస్త్రవేత్తలు కె.అశోక్ కుమార్, కె.మోహన్, విష్ణువర్ధన్, ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు.