
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
ఆత్మకూరురూరల్: వెలుగోడు మండలం తిమ్మనపల్లె గ్రామంలో కట్టుకున్న భార్యను అంతమొందించిన భర్తను వెలుగోడు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. అనుమానంతో ఈనెల 28వ తేదీన భార్య లక్ష్మీదేవిని ఆమె భర్త పసుపుల మధుకృష్ణ గొడ్డలి కామాతో తలపై మోదడంతో ఆమె చనిపోయింది. మృతురాలి తల్లి వెంకట సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం మధుకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు.
నాలుగు గడ్డివాములు దగ్ధం
డోన్ టౌన్: యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములకు చెందిన గడ్డి వాములు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వన్నేపోగు మద్దిలేటి కుమారులు తిమ్మయ్య, మద్దయ్య, లక్ష్మన్న, ఎర్రమల పశుగ్రాసాన్ని కల్లం దొడ్డిలో నిల్వ చేసుకున్నారు. అయితే ఆదివారం ఓ గడ్డి వామి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే నాలుగు గడ్డివాములకు మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించాయా, ఎవరైనా నిప్పు పెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు చెబుతున్నారు.
సచివాలయ ఉద్యోగి బలవన్మరణం
ఆదోని అర్బన్: పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన నారాయణరావు, సరోజబాయి దంపతుల కుమారుడు మధు(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. మధు అనే యువకుడు ఆదోని మండలం కపటి గ్రామంలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి పడుకోవడానికి మేడపైకి వెళ్లి ఆదివారం ఉదయం ఎంత సేపటికి కిందికి రాలేదు. తల్లిదండ్రులు మిద్దైపెకి వెళ్లి చూస్తే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయి ఉన్నాడు. మృతికి గల కారణాలు పని ఒత్తిడో, ప్రేమ వ్యవహారమో తెలియదని, ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.