
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
కర్నూలు(హాస్పిటల్): ‘రోజురోజుకూ వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. తీవ్ర ఎండ వేడిమితో ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు’ అని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
†తలనొప్పి, తలతిరగడం, నీరసం, నాలుక ఎండిపోవడం, తీవ్రమైన జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పూర్తి అపస్మారక స్థితి వడదెబ్బ లక్షణాలన్నారు.
†ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు ఉన్న పల్చటి కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.
†తలకు టోపీ పెట్టుకోవాలని, రుమాలు కట్టుకోవాలని సూచించారు.
†ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్ నీటిని తాగాలన్నారు.
†వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రాంతానికి వెంటనే చేర్చాలని, వారిని తడిగుడ్డతో శరీరమంతా తుడవాలన్నారు. వారు సాధారణ స్థితికి రాకపోతే శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.
†వడదెబ్బ తగలకుండా మంచినీరు వీలైనన్నిసార్లు తాగాలని, ఎండ నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం, కొబ్బరినీరు, నీరు తాగాలని సూచించారు.
†ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదని, శీతల పానియాలు, మంచుముక్కలు వంటివి తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు.
†ముఖ్యంగా చిన్నారులు, గర్భిణిలు, బాలింతలు, వృద్ధులు వడదెబ్బకు గురిగాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అన్ని సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ