
ఈ ప్రభుత్వాన్ని గెలిపించినా ఏమీ లాభం లేదు
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించినా ఏమీ లాభం లేదని, పది నెలలకే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఫ్యాప్టో రాష్ట్ర కో–చైర్మన్ కె.ప్రకాష్‌రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మోసానికి నిరసనగా మోకాళ్లపై నిల్చొని ఆందోళన చేపట్టారు. అనంతరం ఫ్యాప్టో జిల్లా చైర్మన్, జనరల్ సెక్రటరీలు సేవాలాల్ నాయక్, జి.భార్గవ్ అధ్యతన జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కో–చైర్మన్ ప్రకాష్‌రావు మాట్లాడుతూ పదినెలలు గడిచినా 12వ పీఆర్‌సీ చైర్మన్‌ను నియమించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
● 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.
● పెండింగ్ డీఏలు ఇవ్వాలని కోరుతున్నా వినిపించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
● ఉద్యోగులకు సంబంధించి రూ.30 వేలకోట్ల బకాయిలు ఉండగా.. ఇటీవల రూ.6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు.
● సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్ వద్దని, ఓపీఎస్ కావాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియానికి సమాంతరంగా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని కోరుతున్నా లెక్క చేయడంలేదన్నారు.
● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మూడళ్లే వరకు తమకు ఎలాంటి పోరాటాలు చేసే అవసరం తలెత్తలేదని.. ఈ ప్రభుత్వంలో 10నెలలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాల బాట పట్టాల్సి వచ్చిందన్నారు.
● కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గోకారి, జనార్ధన్, యూటీఎఫ్ నాయకులు రవికుమార్, నవీన్, ఏపీటీఎఫ్ నాయచకులు రంగన్న రవికుమార్, ఇస్మాయిల్, మరియానందం, హెచ్‌ఎంఏ నాయకుడు నారాయణ, తిమ్మన్న తదిరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీ ధర్నా