
అరాచక పాలనలో అభివృద్ధి ఏదీ
● పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడింది ● ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం: అరాచక పాలనలో ప్రతిపక్ష పార్టీ నేతలపై దౌర్జన్యాలు, దాడులు తప్ప అభివృద్ధి ఏదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెరవాడ గ్రామంలో జరుగుతున్న శ్రీరామ నవమి వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ముందుగా చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది నెలలకే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట పడిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కూటమి నేతల అక్రమార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. పాణ్యం నియోజకవర్గంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమ తవ్వకాలు, అధికారులపై త్వరలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యుడి జీవనం భారంగా మారుతోందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
గ్రామాల్లో కక్షలు పెంచుతున్నారు
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కూటమి నాయకులు కక్షలు పెంచుతున్నారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఇందుకు కొందరు అధికారులు తోడయ్యారన్నారు. అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఆగడాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించే అధికారులను న్యాయస్థానం ఎదుట నిలబెడతామన్నారు. ఆయన వెంట మాజీ జెట్పీటీసీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, వైస్ ఎంపీపీ పార్వతమ్మ, మాజీ సర్పంచ్‌లు శేషిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రమణారెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, నాగిరెడ్డి , వడ్డుగండ్ల రాముడు, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు జాకీర్‌ఉసేన్, నాయకులు ఎల్లగౌడ్, సుబ్రహ్మణ్యం, ఆటో మాబు, విష్ణు తదితరులు ఉన్నారు.