
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు, సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ గుప్తా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శేషఫణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచికాదన్నారు. చర్చలు, వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ పార్టీలు మసులుకోవాలని.. అయితే పత్రికలు, మీడియాపై దాడికి ప్రయత్నించడం మంచిది కాదని హితవు పలికారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఆరుగురు రిపోర్టర్లపై ఏపీ ప్రభుత్వం కక్షగట్టి క్రిమినల్ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని ‘కూటమి’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు, ‘కూటమి’ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
అక్రమ కేసులపై పోరాటం
సాక్షి ఎడిటర్, ఇతర రిపోర్టర్లపై బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీనియర్ పాత్రికేయులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపైనే ‘కూటమి’ ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. పాత్రికేయుల రక్షణకు వెంటనే మీడియా రక్షణ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. రిపోర్టర్లపై దాడి జరిగిన సమయంలో స్పందించే త్రీమెన్ కమిటీలు పత్తా లేకుండా పోయాయన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల, సీనియర్ రిపోర్టర్లు గోరంట్లప్ప, చంద్రశేఖర్, నాగిరెడ్డి, రవిప్రకాష్, ఎం.రవికుమార్, టి.మద్దులేటి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్‌పై కేసు కక్షపూరితం: ఏపీయూడబ్ల్యూజే
సాక్షి ఎడిటర్, ఆరుగురు జర్నలిస్టులపై
క్రిమినల్ కేసులు దుర్మార్గం
కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
బాధిత కుటుంబం చెప్పిన ఆవేదనను అక్షర రూపంలో ప్రచురిస్తే సాక్షి ఎడిటర్‌తో పాటు మరో ఆరుగురిపై కేసులు పెట్టడం కక్షపూరితమని ఐజేయూ జాతీయ సమితి సభ్యుడు కె.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.వెంకటసుబ్బయ్య, రాష్ట్ర సమితి సభ్యుడు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌రాజు, కార్యదర్శి శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటనను విడుదల చేసి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వార్తలు రాసే విలేకర్లు, ఎడిటర్లపై కేసులు పెడితే ఎలాగని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పత్రికలు ఒక భాగమని, వాటిని అణచివేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించిన ఘటనకు సంబందించి సాక్షి ఎడిటర్, ఇరత రిపోర్టర్లపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.