
తెలుగు నాట కళా వైభవం!
● నాటక సమాజాలతో సామాజిక చైతన్యం ● రంగ స్థలానికి వన్నె తెచ్చిన ఉమ్మడి జిల్లా కళాకారులు ● సంచలనం సృష్టించిన పులిస్వారీ నాటకం ● నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం ● కందుకూరి వీరేశలింగం జయంతి
పల్లె సీమల్లో 1960 నుంచి1990 వరకు నాటక కళ ఒక మహా వైభవాన్ని కలిగి ఉండేది. ప్రతి పల్లెలో దసరా, సంక్రాంతి, తిరునాళ్ల సందర్భంగా పౌరాణిక నాటక ప్రదర్శనలు వైభవోపేతంగా నిర్వహించే వారు. ఉమ్మడి జిల్లాలో తెలుగు నాటకం ఒక వెలుగు వెలిగింది. జిల్లాలోని లొద్దిపల్లె అల్లాబక్ష్, వెల్దుర్తి వెంకటనర్సు నాయుడు, రజనీబాయి లాంటి రంగస్థల కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా నాటక ప్రదర్శనల్లో పాల్గొని రంగస్థలాన్ని సుసంపన్నం చేశారు. ఈ కళాకారులు సినీ కళాకారులకు సైతం ఆదర్శంగా మారిన సందర్భాలు ఉన్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటక రంగం నిన్న మొన్నటి వరకు తారా స్థాయిలో ఉంది. నేడు వివిధ కారణాలతో తిరోగమన దశలో ఉంది. తెలుగు నాట మొదటి నాటక రచయిత, సంఘ సంస్కర్త కందూకూరి వీరేశం లింగం పంతులు. మొదటి నాటక ప్రదర్శన కర్త కూడా ఆయనే. అందుకే ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన ‘తెలుగు నాటక రంగ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పౌరాణిక, సాంఘిక నాటకాల వేదికగా అలరారుతోంది. 1940 ప్రాంతం నుంచే జిల్లాలో పౌరాణిక నాటకాలను నేర్పించి ప్రదర్శించే వారు. నంద్యాలలో బాల్కొండ థియేటర్, కర్నూలులో జిల్లా పరిషత్‌లోని ఆడిటోరియం, మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్, జిల్లా కోర్టు సమీపంలో యునైటెడ్ క్లబ్, సీక్యాంప్‌లోని లలిత కళాసమితి (టీజీవీ కళాక్షేత్రం), నంద్యాల కళారాధన, జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం, విజేత ఆర్ట్స్, ప్రజా నాట్యమండలి, తదితర నాటక సంస్థలు ఇప్పటికే నాటక రంగానికి వన్నె తెస్తూ పనిచేస్తున్నాయి. ఈ నాటక సమాజాలు విభిన్న కథాంశాలతో నాటకాలను రూపొందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. నంది నాటక పోటీల్లో జిల్లా నాటక సమాజాలు అగ్రభాగాన నంది పురస్కారాలను అందుకుంటున్నారు.
జిల్లాలో రాష్ట్ర స్థాయి కళాకారులు
కర్నూలు జిల్లాలో నాటక రంగ పరిస్థితి చూస్తే తురిమెల్ల గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరులు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చక్కని సెట్టింగులు, లైటింగ్‌లతో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1940 ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్థిక వనరుల లేమితో ఈ సంస్థ మూత పడింది. బండి ఆత్మకూరుకు చెందిన బీకే రామసుందర్ రావు, చెలిమెల్ల గ్రామానికి చెందిన కేసీ శివారెడ్డి, వెల్దుర్తి వెంకటన నర్స నాయుడు, లొద్దిపల్లె అల్లాబక్ష్, రజనీబాయి, మల్లారెడ్డి, పత్తి ఓబులయ్య, బీసీ కృష్ణ, సంజన్న, గుర్రపుసాల అంకయ్య, పత్తికొండ రంగారెడ్డి, నంద్యాల బుర్రా వెకంటేశ్వర్లు, పులిపాటి రామమకృష్ణ, శారద, డాక్టర్ రవికృష్ణ, ఎస్‌ఆర్‌ఎస్ ప్రసాద్, వి.వి. రమణారెడ్డి వంటి నటులు నాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
నాటకం సమకాలీన సమస్యలకు దర్పణం. ‘నాటకం.. చిటికెడు వినోదాన్ని, గుప్పెడు అనుభవాలు, దోసెడు అనుభూతులు, చారెడు విజ్ఙానాన్ని ప్రేక్షకులకు పంచి పెడుతుంది’.. అని చెప్పాడో రచయిత. చరిత్రకు ప్రతిబింబం. సంఘ పరిణామాలను పసిగట్టి దగ్గరగా చూపెట్టే చుక్కాని. విజ్ఞానాన్ని, వినోదాన్ని, మానసిక చైతన్యాన్ని ప్రసాదించే వేదిక నాటకం. ఇంతటి అమోఘమైన రంగం చవి చూసిన అటుపోట్లెన్నో.. అయినా ఇప్పటకీ తన ప్రాభవాన్ని చాటుతూనే ఉంది. తెలుగు నాటక రంగ స్థల వైభవం సుస్థిరం.. సుమధరం.. నవరస భరితం. – కర్నూలు కల్చరల్