వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. అయితే టెక్నాలజీ మారిపోయింది. ఫలానా సమయంలో.. ఫలానా చోట.. ఇంత మొత్తంలో వర్షం పడుతుందని కూడా చెప్పేయ గలుగుతున్నాం. మరి చావు సంగతి? రోజుల్లో పోతారనుకున్న వాళ్లు నిక్షేపంగా ఏళ్లు గడిపేయడం మనం చూశాం. అలాగే రాయిలా దిట్టంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిన వైనాలూ మనకు తెలుసు. అందుకే మరణాన్ని అంచనా వేయడం ఇప్పటికీ కష్టమే. కానీ.. మీ వివరాలు నాకివ్వండి.. మీరెంత కాలం బతుకుతారో చెప్పేస్తానంటోంది ఓ కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్. ఆసక్తికరమైన ఆ వివరాలేమిటో చూసేద్దామా...!!!
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కృత్రిమమేధ సంచలనాల వార్తలే. అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబులు చెప్పడమే కాదు.. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఆసుపత్రుల్లో.. ఇలా అన్నిచోట్ల మనిషి పనిని మరింత సులువు చేసేస్తోంది ఈ కృత్రిమమేధ. ఆఖరకు మనం ఎంత కాలం బతుకుతామో చెప్పగలిగే స్థితికి చేరింది. నిజానికి చిరాయుష్షు.. అది కూడా ఆరోగ్యవంతమైన జీవితం అన్నది మనిషి యుగాలుగా కంటున్న కల. వైద్యులను అడిగితే, లేదా హెల్త్ వెబ్‌సైట్లు చూస్తే.... మంచి ఆహారం తీసుకోండి.. వ్యాయామం చేయండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఎక్కువ కాలం బతుకుతారని తెలుస్తుంది. ఇలా కాకుండా... ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటే.. అవే అలవాట్లు, ఆహారాన్ని కొనసాగిస్తే ఎంత కాలం బతుకుతామో ‘డెత్ క్లాక్’ వెబ్‌సైట్ (కథనం చివరలో లింక్ ఉంది) చెబుతుంది. మీరు చేయాల్సిందిల్లా సింపుల్. వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి వివరాలు ఇవ్వడమే.
డెత్ క్లాక్ వెబ్‌సైట్‌ను తెరవగానే... ‘‘నేను ఎప్పుడు చచ్చిపోతాను? అని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా’’ అని కనిపిస్తుంది. కిందనే.. మీ ఆయుష్షు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అన్న టీజింగ్ ప్రశ్న కూడా కనిపిస్తుంది. దాని కింద...
మీ పుట్టిన రోజు, స్త్రీ/పురుషుడు అన్న వివరం, ధూమపానం చేస్తారా? అన్న ప్రశ్నతోపాటు మరికొన్ని అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. అన్నింటి వివరాలు ఇచ్చేస్తే... కృత్రిమమేధ సాయం రంగంలోకి దిగుతుంది. మీరిచ్చిన వివరాల ఆధారంగా ఆయుష్షును లెక్కకడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి మరి..
లింక్..
(నోట్: ఇది కేవలం సరదా కోసం ఉద్దేశించింది మాత్రమే. ఇది కచ్చితంగా వాస్తవంగా జరుగుతుందని ఏమీ లేదు. మరణ తేదీని కచ్చితంగా చెప్పలేమని వెబ్‌సైట్ నిర్వాహకులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని గమనించగలరు. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్ ద్వారా ఆయుష్షును అంచనా వేసుకున్న వారి సంఖ్య.. 60,039,306)
-జి.గోపాలకృష్ణ మయ్యా
మీ ఆయుష్షు ఏమిటో తెలుసుకుంటారా?
Published Sat, Oct 12 2024 11:15 AM | Last Updated on Sun, Oct 13 2024 8:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment