మృత్యువు ఎప్పుడో ముందే చెబుతుంది
వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియదనేది సామెత. కానీ విజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తాయో ముందే తెలుసుకుంటున్నాం. మరి అదే తరహాలో మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో తెలుసుకోగలిగితే.. డెత్ డే ఫలానా రోజు అని ముందే అవగతమైతే ఎలా ఉంటుంది? మరణం ఎప్పుడో తెలిసిపోతే ఆ భయంతోనే సగం చచ్చిపోతాం బాబోయ్ అని అనుకునేవాళ్ల కోసం కాకుండా.. మన జీవితంలో ఆ రోజు ఎప్పుడో తెలుసుకుందాం అనే ఔత్సాహికుల కోసం ఓ వినూత్న యాప్ అందుబాటులోకి వచ్చింది. అన్నీ ముందుగానే అంచనా వేస్తున్నాం.. మరణాన్నీ ముందే తెలుసుకోలేమా అనే ఆలోచనతో బ్రెంట్ ఫ్రాన్సన్ అనే డెవలపర్ ‘డెత్ క్లాక్’పేరుతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. అలా అని.. దీనికి దివ్యమైన శక్తులేమీ లేవు. అది అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా సదరు వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కచ్చితంగా అంచనా వేసి చెబుతుంది అంతే. ఇందులో కృత్రిమ మేధ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) కీలకపాత్ర పోషిస్తుంది. దాదాపు 1,200 మంది ఆయుర్దాయాలపై వివిధ కోణాల్లో అధ్యయనం జరిపి దీన్ని రూపొందించారు. ఈ ఏడాది జూలైలో డెత్ క్లాక్ అందుబాటులోకి రాగా.. మూడు నెలల్లోనే 1.25 లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని తమ చివరిరోజు గురించి తెలుసుకున్నారు.ఇది ఎలా పని చేస్తుందంటేడెత్ క్లాక్ యాప్‌లో వయసు, లింగం, జాతి వంటి ప్రాథమిక సమాచారంతోపాటు కుటుంబ చరిత్ర, మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల గురించి సమాధానాలు నమోదు చేయాలి. అలాగే రోజువారీ జీవనశైలి, వ్యాయామం, ధూమపానం, మద్యం అలవాట్ల గురించి అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. ఆహారపు అలవాట్లతో పాటు నిద్రశైలి గురించీ వివరించాలి. అప్పుడు ఆ యాప్.. ఆయా వివరాల ఆధారంగా అధునాతన అల్గారిథమ్‌ల సాయంతో మరణం ఎప్పుడు సంభవిస్తుందనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించి చెబుతుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎంత కచ్చితమైన వివరాలు నమోదు చేస్తే, అంత కచ్చితమైన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏం ఉపయోగంరేపు ఏదైనా అపాయం జరుగుతుందని ముందు తెలుసుకుంటే దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవచ్చు.. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మృత్యువు ఫలానారోజు పలకరిస్తుందని ముందే తెలిస్తే.. జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది కదా అనేది ఈ యాప్ రూపకర్తల వాదన. డెత్ డేట్‌ను చెప్పడమే కాదు.. ఆయుర్దాయం పెంచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవడం, ధూమపానం, మద్యపానం మానేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి టిప్స్ చెబుతుంది.వాటిని పాటించడం ద్వారా డెత్డేట్ను పొడిగించుకోవచ్చన్న మాట. కాగా, ఆరోగ్య స్పృహ ఉన్నవారు, ఆర్థిక ప్రణాళికదారులు డెత్ క్లాక్‌పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. తమ చివరి తేదీని బట్టి చేయాల్సిన పనులు పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుందనే భావన వారిలో ఉండటమే ఇందుకు కారణం. మీకూ ఈ భావన ఉంటే ఓసారి ట్రై చేయండి. పోయేదేముంది? మహా అయితే 40 డాలర్లు (దాదాపు రూ. 3,400). ఎందుకంటారా? ఈ యాప్‌లోని అన్ని ఫీచర్లూ పని చేయాలంటే అంత మొత్తం వెచ్చించక తప్పదు మరి. – సాక్షి సెంట్రల్ డెస్క్